|
లాస్ ఏంజెలిస్: పాప్ సంగీత స్వరఝరి, బ్రేక్ షేక్‌ల 'మూన్‌వాకర్'.. మైఖేల్ జాక్సన్ ఇక లేరు! ఎన్నో రికార్డులు.. ఎన్నో సంచలనాలు.. మరెన్నో వివాదాలు.. కోటాను కోట్ల అభిమానులు, వేల మంది విమర్శకులు.. అందరినీ.. అన్నింటినీ.. వదిలి వెళ్లిపోయారు శాశ్వతంగా!! జాక్సన్(50) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. అమెరికా లాస్ ఏంజెలిస్‌లోని తన బెల్ ఎయిర్ భవంతిలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువుల ఫోన్‌కాల్‌తో అక్కడికి చేరుకున్న వైద్యసిబ్బంది ఛాతీపై బలంగా ఒత్తుతూ జాక్సన్ గుండె తిరిగి కొట్టుకునేలా చేయడానికి కృషిచేశారు. అయినా ఫలితం లేకపోవడంతో రోనాల్డ్ రీగన్ యూసీఎల్‌ఏ వైద్య కేంద్రానికి తరలించారు. జాక్సన్ అర్ధరాత్రి దాటాక 2:56 గంటలకు(భారత కాలమానం) మృతిచెందినట్లు లాస్ ఏంజెలిస్ కౌంటీ కరోనర్ కార్యాలయానికి చెందిన లెఫ్టినెంట్ ఫ్రెడ్ కోరల్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణం ప్రపంచవ్యాప్తంగా జాక్సన్ అభిమానులు ఒక్కసారిగా నిశ్ఛేష్ఠులయ్యారు. దాదాపు 40 ఏళ్లపాటు తన సంగీత, నాట్యాలతో ఓలలాడించిన తమ ఆరాధ్య గాయకుడు మరిలేరని తెలిసికన్నీళ్ల పర్యంతమయ్యారు.
''ఇంట్లో గుండెపోటు వచ్చి మరణించారనుకుంటున్నాం. శవపరీక్ష ఫలితాలు వచ్చేదాక ఆయన మృతికి కారణాలు కచ్చితంగా చెప్పలేం. ఇది మాకు చాలా కష్టకాలం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించొద్దని మీడియాను కోరుతున్నా'' అని జాక్సన్ సోదరుడు జెర్మెయిన్ జాక్సన్ మీడియాతో పేర్కొన్నారు. ఆ సమయంలో జెర్మెయిన్, టిటో, ర్యాండీ సహా ఆయన సోదరులు, సోదరీమణులు జానెట్ జాక్సన్, లటోయాతోపాటు తల్లి కూడా జాక్సన్ పక్కనే ఉన్నారు. ఎంతోకాలం తర్వాత జాక్సన్ మళ్లీ జనం ముందుకు వస్తున్నాడని, వచ్చేనెలలో లండన్‌లో ప్రదర్శనలిస్తాడని ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ పరిణామం ఆయన అభిమానుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆయన మరణ వార్త తమను ఎంతగానో కలచివేసిందని ప్రపంచంలోని పలువురు సంగీత, సినీప్రముఖులు పేర్కొన్నారు.
ఇద్దరు భార్యలు.. ముగ్గురు బిడ్డలు
జాక్సన్‌కు ముగ్గురు పిల్లలు. వారిలో ఒకరి పేరు ప్రిన్స్ మైఖేల్ జాక్సన్-2 కాగా మిగతా వారి పేర్లు.. మైఖేల్ జోసెఫ్ జాక్సన్ జూనియర్, పేరిస్ మైఖేల్ కేథరీన్ జాక్సన్. ప్రముఖ పాప్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ కుమార్తె లీసా మేరీ ప్రెస్లీని మైఖేల్ 1994లో పెళ్లిచేసుకున్నాడు. వారి బంధం రెండేళ్లకే చెడింది. ఇది పత్రికల్లో పతాక శీర్షికగా నిలిచింది. తర్వాత 1997లో జాక్సన్ 37 ఏళ్ల నర్సు డెబీరోను పెళ్లాడాడు. ప్లాస్టిక్ సర్జరీల సమయంలో కలిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక.. 1999లో విడాకులు తీసుకున్నారు. జాక్సన్ మూడో బిడ్డ ప్రిన్స్ మైఖేల్-2 తల్లి ఎవరన్నది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు.
ఇంటర్నెట్‌లో తొలి వార్త
తాజా వార్త ఏదయినా మొదట టీవీల్లో వస్తుంది. జాక్సన్ మృతి వార్త మాత్రం మొదట ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చింది. 911 సర్వీసుకు జాక్సన్ ఇంటి నుంచి ఫోను వచ్చిన గంటలోపే టీఎంజెడ్ వెబ్‌సైట్ ఆ వార్తను నెట్‌లో పెట్టింది. జాక్సన్ స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2:26 గంటలకు మరణించగా.. 2:44 గంటలకు ఇంటర్నెట్‌లో వార్త ప్రత్యక్షమైంది. ఈ విషయం తెలియగానే.. ఆయన అభిమానులు ఇంటర్నెట్‌పై పడ్డారు. టీఎంజెడ్‌తోపాటు మైఖేల్ జాక్సన్ వెబ్‌సైట్ రద్దీ విపరీతంగా పెరిగింది.
రూ.2 వేల కోట్ల అప్పులు!
బాలలపై లైంగిక వేధింపుల వివాదాల నేపథ్యంలో మైఖేల్ జాక్సన్ చాలాకాలంగా రహస్య జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో ఆయన 40 కోట్ల డాలర్ల(సుమారు రూ.2 వేల కోట్లు) మేర అప్పుల పాలయ్యారని సమాచారం. వాటిని తీర్చేయడానికి జులై 13 నుంచి 50 రోజులపాటు ప్రదర్శనలివ్వాలని నిర్ణయించారు. ఆ ప్రదర్శనలకు 'దిస్ ఈజ్ ఇట్' అని కూడా పేరుపెట్టారు. ఆ అప్పులు తీర్చి తన సత్తా నిరూపించుకునే ఆ ప్రదర్శన ఇవ్వకుండానే పాప్ రారాజు కన్నుమూశాడు. దీంతో ఈ ప్రదర్శనల నిర్వాహకులు వసూలుచేసిన 8.5 కోట్ల డాలర్ల మొత్తాన్ని వాపసు చేయనున్నారు. జాక్సన్ హఠాత్ మరణంతో ఆయన పాప్ ఆల్బంల విక్రయం శుక్రవారం ఉన్నట్టుండి పెరిగింది. కనిపించకుండా పోయిన డాక్టర్!
మైఖేల్ జాక్సన్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... ఇప్పటిదాకా ఆయన వెన్నంటి ఉన్న డాక్టర్ శుక్రవారం హఠాత్తుగా కనిపించకుండా పోయారు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. |