గతేడాది ప్రథమార్థంలో కళ తప్పిన మల్టీప్లెక్స్‌లు ఇప్పుడు మళ్లీ కళకళ్లాడుతున్నాయి. ద్వితీయార్థంలో రిలీజైన సినిమాలు మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టడంతో ఉత్సాహంగా విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు, డిస్ట్రిబ్యూటర్లతో గొడవలతో గతేడాది ప్రథమార్థమంతా మల్టీప్లెక్స్‌లకు గడ్డుకాలంగానే నడిచింది. ఆర్థిక సంక్షోభ ప్రభావాలు తమ వంతు ప్రతాపం చూపడంతో విస్తరణ ప్రణాళికలు అటకెక్కాయి. అయితే, ఆగస్టు నుంచి సినిమాలు వెల్లువ మొదలైంది. వందకోట్ల బడ్జెట్ సినిమా బ్లూ, లండన్ డ్రీమ్స్ వంటి భారీ చిత్రాలు భారీగానే నిరాశపర్చినా.. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ వంటి చిత్రాలు కాస్త కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 19 రోజుల్లోనే రూ.315 కోట్లు ఆర్జించిన 3 ఇడియట్స్ సినిమా... ఫేమ్ వంటి చిన్నా చితకా మల్టీప్లెక్స్‌లకు కూడా భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో మల్టీప్లెక్స్‌ల మూడో త్రైమాసికం ఆదాయాల్లో కనీసం 30 నుంచి 40 శాతం దాకా వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2009 - 10 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంటెంట్ మెరుగుపడటంతో మల్టీప్లెక్స్ పరిశ్రమ మొత్తం మీద 20 శాతం మేర పెరగ వచ్చునని భావిస్తున్నారు.
గతేడాది ప్రథమార్థంలో సంక్షోభం రావడం కూడా ఒకందుకు మంచిదేనని మల్టీప్లెక్స్‌లు భావిస్తున్నాయి. దీని వల్ల ప్రణాళికలను పునఃసంమీక్షించుకునేందుకు అవకాశం లభించిందని అంటున్నాయి. ఆదాయలపై సరైన అంచనా, అనవసర వ్యయం తగ్గించుకోవడం, ప్రణాళికబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సంక్షోభం మల్టీప్లెక్స్‌లకు నేర్పిందని పీవీఆర్ గ్రూప్ ప్రెసిడెంట్ ప్రమోద్ అరోరా అభిప్రాయపడ్డారు. అటు సినీ పరిశ్రమ కూడా పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుందని మల్టీప్లెక్స్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఆడియో, శాటిలైట్ హక్కులు అమ్ముకోవడం ద్వారా ఎంత సంపాదించుకున్నా... సినిమా బాక్సాఫీస్ హిట్ అన్న టాక్‌తో వచ్చే సంతృప్తి, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వలేవని వారంటున్నారు. పైగా సగటున సినిమా ఆదాయంలో 75 శాతం బాక్సాఫీస్ నుంచి వస్తే... మళ్ళీ ఇందులో 50 శాతం వాటా మల్టీప్లెక్స్‌ల నుంచే ఉంటోందని ఐనాక్స్ లీజర్ సీఈవో అలోక్ టాండన్ తెలిపారు. కాబట్టి మల్టీప్లెక్స్‌ల ప్రాధాన్యాన్ని విస్మరించడం సరికాదన్నారు.
మల్టీప్లెక్స్‌ల నిర్వహణ వ్యయం భారీగా ఉంటుంది కాబట్టి ఆదాయమూ అదే స్థాయిలో ఉండాల్సిందే. అందుకే నిర్వాహకులు ఏ చిన్న ఆదాయమార్గాన్నీ విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేరు. ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి కార్పొరేట్ కాన్ఫరెన్స్‌లు, దుర్గా పూజ మేళాల దాకా అన్నింటిని ప్రదర్శించేందుకు సై అంటున్నాయి. ఫుడ్, అడ్వర్టైజింగ్ మొదలైనవి కూడా మల్టీప్లెక్స్‌లకు ఆదాయం తెచ్చిపెట్టేవే.
|