ఐదు దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వం 'చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా'ను నెలకొల్పింది. ఎందరో ప్రముఖులు
ఈ సంస్థకు నేతృత్వం వహించారు. ప్రస్తుతం ప్రముఖ నటి నందితాదాస్ సారథ్యంలో ఈ సంస్థ పనిచేస్తోంది. బాలల
చిత్రాలు, చిత్రోత్సవాలు మొదలైన అంశాల గురించి తన మనుసలోని మాటలు ఇలా చెప్పుకొచ్చింది...
రిమోట్ బటన్ నొక్కితే చాలు బుల్లితెరపై వినోదమే వినోదం ! సినిమాలు, కార్టూన్లు వస్తున్నాయి. ఇక రియాల్టీ షోల
సంగతి తెలిసిందే. కొన్ని బాగున్నాయి. మరికొన్ని శృతిమించి నడుస్తున్నాయి. వయసుకు మించిన మాటలు
చెప్పిస్తున్నారు. సహజమైన బాల్యాన్ని అందించే ప్రోగ్రామ్‌లా కనిపించటం లేదు. ఆకర్షణలు మితిమీరుతున్నాయి.
ఇటువంటి పరిస్థితిలో పిల్లల కోసం సినిమాలు నిర్మించటం ఎంత అవసరమో అంత సవాల్ !
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చలన దినోత్సవాలు పదహారేళ్లుగా జరుగుతున్నాయి. ఇప్పుడు కోల్‌కతా
నగరంలో బాలలకు వీటిని చూసే అవకాశాన్ని కల్పించాలని నా ఉద్దేశం. రాబోయే నవంబర్‌లో వీటిని భారీ ఎత్తున
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
రెండేళ్ల క్రితం ఈ పదవిని స్వీకరించమన్న ప్రతిపాదన వచ్చినప్పుడు వద్దనుకున్నా. కానీ పిల్లల కోసం సరైన
సినిమాలు రావటం లేదన్న వాస్తవం నన్ను ఆలోచింపజేసింది. శ్యాంబెనగల్ ప్రోత్సాహంతో అంగీకరించాను. 55
సంవత్సరాల నాటి ఈ సంస్థలో రాత్రికి రాత్రి మార్పులు తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించే మంత్రదండ నా దగ్గర
లేదు. కానీ నా పరిధిలో కొన్ని ప్రణాళికలు తయారు చేశాను. చిత్రోత్సవాలు, ప్రదర్శనలు దేశంలోని అందరికీ
అందుబాటులో నిర్వహించాలన్నది మొదటిది.
భారతీయ సాహిత్యంలో మంచి కథలున్నాయి. హారీపోటర్ కథల్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు.
బాలల్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని క్లాసిక్స్‌ని యానిమేషన్ చిత్రాలుగా నిర్మించాలన్నది సంస్థ ఉద్దేశం. వీటిని
నిర్మించటం ఒక ఎత్తు, సినిమా, టీవీ మాధ్యమాల ద్వారా బాలలకు చూపించటం మరో ఎత్తు. బృహత్తర ప్రయత్నం.
దాన్ని విజయవంతం చేయాలన్నదే మా ధ్యేయం.