మసాలా
 
 
 
 
సినీ నేస్తాలూ ఇక సెలవు!
సినీ నేస్తాలు ఇక సెలవు అంటూ నటి నయనతార గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టినట్టు తెలిసింది. ప్రభుదేవా, నయనతార త్వరలో పెళ్లికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో నయనతార నటనకు స్వస్తి పలకనున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. అనంతరం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రభుదేవాకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రభుదేవా, నయనతార చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని ఆయన భార్య రమాలత్ తీవ్రంగా ఖండించారు. తరువాత ఒక ఒప్పందంతో వివాహ రద్దుకు సమ్మతించారు. కోర్టు త్వరలో వీరి వివాహ రద్దును ప్రకటించనుంది. దీంతో ప్రభుదేవా, నయనతారల పెళ్లికి లైన్ క్లియర్ కానుంది. కాగా వివాహనంతరం సినిమాల్లో నటించకూడదని నయనతారకు ప్రభుదేవా కండిషన్ పెట్టారట. అందుకు ఆమె కూడా సమ్మతించారట. ప్రస్తుతం నయనతార శ్రీరామరాజ్యం అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఈమె చివరి చిత్రం కానుంది. బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుదేవా, నయతార ముంబయిలో ఉంటున్నారు. వీరి వివాహం కూడా ముంబయిలోనే జరిగే అవకాశం ఉంది. కాగా శ్రీరామరాజ్యం చిత్ర షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన నయనతార మంగళవారంతో ఆ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. అనంతరం యూనిట్ సభ్యులందరినీ కలుసుకుని నమస్కరిస్తూ బాధగా సెలవు తీసుకున్నారని తెలిసింది. ఆ చిత్ర హీరో బాలకృష్ణ నయనతారను ఓదార్చుతూ వివాహానంతరం మళ్లీ నటించవచ్చని చెప్పగా ప్రభుదేవా నిబంధన గురించి నయనతార చెప్పినట్లు సమాచారం.