"నా బేనర్‌లో చాలామంది హీరోయిన్లు యాక్ట్ చేశారు కానీ, నయనతారలో ఉన్న మంచితనం
ఎవరిలోనూ కనిపించలేదు' అని కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఈ కేరళ కుట్టిని అభినందిస్తున్నారు.
ఉపేంద్ర, నయనతార జంటగా కన్నడంలో ఆయన 'సూపర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం
షూటింగ్ ఇటీవల లండన్‌లో జరిగింది. సినిమా ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటివరకు నయనతార వల్ల
తమకెలాంటి సమస్య రాలేదని చిత్రకథానాయకుడు ఉపేంద్ర ఆ మధ్య పేర్కొన్నారు.
తాజాగా రాక్‌లైన్ వెంకటేష్ చెబుతూ- "లండన్‌లో నయనతార టాప్ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస కల్పించమని అడుగుతుందని అనుకున్నాను. కానీ మేం ఏర్పాటు చేసిన సాదాసీదా గదిలోనే తను బస చేసింది.కొంతమంది తారల్లా ఐదు నక్షత్రాల హోటల్‌లోనే ఉంటానంటూ డిమాండ్ చేయలేదు. అలాగే లండన్‌లో షూటింగ్ సమయంలో నయనతారకు ఓ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యింది. అయినప్పటికీ షూటింగ్ రద్దు చేయమనకుండా తన వంతు సహకారాన్ని అందించింది. తనెంత ఇబ్బంది పడిందీ ఆ మర్నాడు నయనతార చెప్పినప్పుడు మేం బాధపడ్డాం. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక
సన్నివేశాలను మురికివాడల్లో చిత్రీకరించాం. తనకి సంబంధించిన షూటింగ్ పూర్తయినప్పటికీ
మురికివాడల దగ్గరే ఉండి మొత్తం షూటింగ్‌ను తిలకిస్తూ కూర్చునేది. కేవలం తన సన్నివేశాలే కాకుండా
మిగతా సీన్స్ గురించి కూడా తెలిస్తే ఇంకా మంచి ఔట్‌పుట్ ఇవ్వొచ్చనది తన అభిప్రాయం అయ్యుండొచ్చు.
నేటి తరం తారల్లో ఇలా ఆలోచించేవాళ్లు తక్కువ మంది ఉంటారు. ఇవన్నీ అలా ఉంచితే... మొత్తం
80 రోజులు షూటింగ్ చేసి, సినిమా పూర్తయిన తర్వాతే ఆమె ఫైనల్ పేమెంట్ తీసుకుంది. డబ్బు
మొత్తం చేతిలో పెడితేనే షూటింగ్‌కి వస్తాం అని డిమాండ్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితిల్లో నయనతారలాంటివారు
ఉండటం ఆశ్చర్యకరం' అని ప్రశంసల వర్షం కురిపించేశారు.
|