సినిమా అంగీకరిస్తున్నామంటే ఆ కథ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే ఒప్పుకోవాలి. లేకపోతే తరువాత ఎవరిని ఏమన్నా
ప్రయోజనం ఉండదు..అని వివరిస్తోంది నిత్యమీనన్. సాధారణంగా కథానాయికలు తమ పాత్ర ఏంటో తెలుసుకుని
సినిమాలో నటించడానికి పచ్చ జెండా ఉపేస్తారు. కానీ నిత్య మాత్రం అలా కాదట ! 'కథ వినేటప్పుడు పూర్తిస్థాయిలో
నిమగ్నమవుతాను. అంతేకాని దర్శకనిర్మాతలు చెప్పే కథని ఏదో నామమాత్రంగా వినేసి పారితోషికం గురించి చర్చ
మొదలుపెట్టను. కథ నచ్చాకే పారితోషికం గురించి ఆలోచిస్తాను. కథ నచ్చకపోయినా చివరివరకూ వింటాను. ఒకవేళ కథ
బాగుంటే నా ఒక్కపాత్రనే విని ఊరుకోను. మిగిలిన పాత్రల తీరుతెన్నులు కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే నా పాత్ర
బాగున్నంత మాత్రాన సినిమా విజయం సాధించదు. సినిమా ప్రేక్షకాదరణ పొందితేనే నాక్కూడా మంచి పేరు వస్తుంది.
తీయబోయే సినిమాలో కుటుంబాన్ని అలరించే అంశాలు కుదిరితే బాగుంటుంది. ఏదో అంశాన్ని బేస్ చేసుకొని తీయటం
సులభం. కానీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చాలా కష్టం.
ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందిరికి డ్యాన్స్‌లంటే ఇష్టం, మరికొందరికి ఫైట్లంటే ఇష్టం ఉంటుంది. కామెడీ
ఉంటేనే మొగ్గుచూపే వాళ్లుంటారు. ఇలా డిఫరెంట్ సెక్షన్ల ప్రేక్షకులు ఒక సినిమాను ఇష్టపడేలే చేయటం అంత ఈజీ కాదు '
అని నిత్య అభిప్రాయపడుతోంది. గ్లామర్ తరహా పాత్రలకు ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఆమె తన ధోరిణిని మార్చుకునే
ఉద్దేశంలో ఉందని చిత్ర పరిశ్రమ ద్వారా తెలిసిన సమాచారం. మలయాళంలో ఇంతకు ముందు సేతుమాధవన్
దర్శకత్వంలో రూపొందిన ఓ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ తీయబోతున్నారు. నాడు లక్ష్మి పోషించిన పాత్రను ఇప్పుడు నిత్య
దక్కించుకొంది. ఇందులో నిత్య గ్లామరస్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు, తెలుగు, తమిళ భాషల్లో
తీసుకురావాలనుకుంటున్నారు.
|