Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మేలో ఎన్టీఆర్ పెళ్ళి

      యువ కథానాయకుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పెళ్లి కొడుకవుతున్నారు. నార్నె లక్ష్మీ ప్రణతిని ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే ఎన్టీఆర్‌ తన తల్లితండ్రులు నందమూరి హరికృష్ణ, శాలినిలతో కలిసి పెళ్లి చూపులకు వెళ్లివచ్చారు. లక్ష్మీప్రణతి ఎవరో కాదు... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పెద్ద చెల్లెలు రాజేశ్వరి మనవరాలు. లక్ష్మీప్రణతి తల్లితండ్రుల పేర్లు నార్నె మల్లిక, శ్రీనివాసరావు. మల్లిక చంద్రబాబు నాయుడికి మేనకోడలు. వారి ముద్దులపట్టి ఇప్పుడు ఎన్టీఆర్‌ గృహలక్ష్మి కానుంది. నార్నె శ్రీనివాసరావు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఆయన ఓ ప్రైవేటు న్యూస్‌ ఛానల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వివాహానికి సంబంధించి త్వరలోనే నిశ్చితార్థం వేడుకను నిర్వహిస్తారు. మే, జూన్‌ మాసాల్లో వివాహం ఉండవచ్చునని సమాచారం. ఈ వివాహానికి సంబంధించి కొద్దిరోజులుగా రెండు కుటుంబాల మధ్య మాటలు సాగుతున్నాయి. నాలుగురోజుల క్రితం నార్నె శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన కార్యక్రమంలో వివాహం ఖరారు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్‌తోపాటు ఆయన తల్లితండ్రులు, చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, ఎన్టీఆర్‌ సోదరులు కల్యాణ్‌రామ్‌, జానకీరామ్‌ కొందరు సన్నిహితులు పాల్గొన్నట్లు సమాచారం. లక్ష్మీప్రణతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఎన్టీఆర్‌, చంద్రబాబు కుటుంబాల మధ్య ఇది మూడవ వివాహ బంధం. ఎన్టీఆర్‌ సినీ నటునిగా ఉండగా ఆయన కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహం జరిగింది. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రెండేళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌కు నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణికి వివాహం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నందమూరి హరికృష్ణ కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహంతో రెండు కుటుంబాల మధ్య బంధం మరింత బలపడనుంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005