Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఎన్టీఆర్‌పై.. యానిమేషన్‌ చిత్రం

      ఎన్టీఆర్‌ అనే మూడక్షరాలు సంచలనానికి మారుపేరు. ఆయన కొన్ని దశాబ్దాలు తెలుగు సినీ జగత్తును ఏలారు. తదుపరి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుపుతూ...తెలుగువాడి సత్తా ఏమిటో తన రాజకీయ రంగ ప్రవేశం ద్వారా నిరూపించి ఢిల్లీ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదగగలిగారు. ఆంగికం, వాచకం, అభినయం, హావభావం ఒకే వ్యక్తిలో కలబోస్తే ఆ వ్యక్తే ఎన్టీఆర్‌. నాటకరంగ అనుభవంతో ఎప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా తన నటనలో పరిణితిని ప్రదర్శించేవారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన ప్రతినాయకుని పాత్రలను కూడా హీరోను డామినేటింగ్‌ చేసే విధంగా తానే నటించి మెప్పించేవారు. సీతారామ కళ్యాణంలో రావణాసురుని పాత్రలో అంతా తానై నడిపించారు. అలాగే దానవీరశూరకర్ణ చిత్రంలో 5 పాత్రలు చేసి దుర్యోధనుడి చేత డ్యూయెట్‌ పాడించిన ఘనత ఆయనదే.

ఆ రోజుల్లోనే ఎన్టీఆర్‌ కొన్ని ప్రయోగాత్మక పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. చిరంజీవులు చిత్రంలో గుడ్డివాడిగా, కలిసివుంటే కలదు సుఖం చిత్రంలో అంగవైకల్యం ఉన్న పాత్రలలో జీవించారు. ఆత్మబంధువు చిత్రంలో నమ్మకమైన పనివాడుగా యజమానిని కంటికి రెప్పలా చూసుకునే పాత్రల్లో కరుణరసం పండించారు. ఆయనలోని సేవాదృక్ఫథాన్ని ఆయన నటించిన చాలా చిత్రాలలో కూడా పేదవారికి సేవ చేసే పాత్రల ద్వారా నటించేవారు. అందుకే ఆయన సామాన్య జనానికి అంత దగ్గరయ్యారు. ఆ స్ఫూర్తితోనే ఆయన రాజకీయరంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

అలా అటు సినీ రంగంలోను, రాజకీయరంగంలోనూ సంచలనం సృష్టించారు ఎన్టీఆర్‌. ఇటీవల ఓ యువ నిర్మాత ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను అన్నీ సేకరించి ఒక మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పూర్తి నిడివితో 3డి యానిమేషన్‌ చిత్రాన్ని నిర్మించే యత్నంలో ఉన్నారట. సో...ఇక మనం యానిమేటెడ్‌ ఎన్టీఆర్‌ను చూడబోతున్నామన్నమాట. యానిమేటెడ్‌ సినిమాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉండటంతో ఎన్టీఆర్‌ చరిత్ర ఇక అంతర్జాతీయ స్థాయిలోకూడా పాకనుందన్నమాట. ఇది నిజంగా ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్తే. గతంలో జూ.ఎన్టీఆర్‌ సినిమా యమదొంగలో ఓ పాటలో ఇద్దరు ఎన్టీఆర్‌లు కనువిందు చేశారు. ఆ చిత్రం మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రికార్డులు సృష్టించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ఔత్సాహిక తెలుగు సినీ నిర్మాత ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కసరత్తు మొదలెట్టారని సినీ వర్గాల భోగట్టా...

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005