స్వదేశీ, విదేశీ సోయగాలతో కథానాయికల్లో ప్రత్యేకంగా కనిపించే పార్వతీ మెల్టన్ ‘వెన్నెల’తో విజయవంతంగా తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించినా, ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది. ఆమధ్య పవన్ కళ్యాణ్ పక్కన ‘జల్సా’లో మళ్ళీ మరోసారి మెరిసిన పార్వతి ఇప్పుడు మంచి అవకాశాల వేటలోనే కొనసాగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా పార్వతీమెల్టన్ మనసులో మాటలు...
మా స్వస్థలం అమెరికాలోని కాలిఫోర్నియా. నేను అక్కడే పుట్టి, పెరిగాను. నా చదువంతా యుఎస్‌ఎలోనే కొనసాగింది. ఇక మా నాన్న జర్మన్ కాగా, అమ్మ ఇండియన్. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. పలు రకాల నృత్యాలను చిన్నతనం నుంచే నేర్చుకున్నాను. చదువుకునేటప్పుడు నా ఫేవరేట్ సినీస్టార్ల నటనను అనుకరిస్తుండేదాన్ని. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సినీస్టార్ల మ్యానరిజమ్స్‌ను అనుకరిస్తూ మా అమ్మ, నాన్నలను బాగా నవ్విస్తుండేదాన్ని. నాకు కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో మోడలింగ్‌లోకి ప్రవేశించాను. అమెరికాలో మోడల్‌గా పలు ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాను.
అంతేగాకుండా చైనా, జపాన్, ఆస్ట్రేలియాలో సైతం మోడలింగ్ చేశాను. ఈ సమయంలో నాకు తెలుగులో ‘వెన్నెల’ సినిమాలో చేసేందుకు అవకాశం వచ్చింది. అమెరికన్ ఎన్‌ఆర్‌ఐ ఒకరు ఈ సినిమాను రూపొందించారు. ఆయన నన్ను ఈ సినిమాలో చేస్తావా అని అడగడంతో నేను వెంటనే ‘ఓకె’ అన్నాను. ఇక ‘వెన్నెల’ షూటింగ్ అంతా అమెరికాలోనే జరగడం నా అదృ ష్టం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా ఈ సినిమాలో నటించేందుకు నాకు అవకాశం కలిగింది. ఈ సినిమాలో యుఎస్‌లో చదువుకునే తెలుగు అమ్మాయి పాత్ర చేశాను. నా మొదటి సినిమా నాకు నటిగా, గ్లామరస్ తారగా మంచి పేరు తీసుకువచ్చింది.
నా ఫేవరేట్ హీరో అమితాబ్ బచ్చన్. ఆయన సినిమాలంటే ఇష్టం. ఆయన నటించిన పలు సినిమాలు చూశాను. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించాలనేది నా కోరిక. ఇక బాలీవుడ్ అందాల తారలు శ్రీదేవి, మాధురీదీక్షిత్‌లు నా ఫేవరేట్ హీరోయిన్‌లు. అందానికి ప్రతిరూపంగా ఉండే ఈ అందాలభామలు తమ నటన, గ్లామర్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిలాగా మంచి సినిమాల్లో నటించి దేశంలో ప్రముఖ నటిగా పేరుతెచ్చుకోవాలని ఉంది.
మన భవిష్యత్తు మన చేతిలో ఉండదని నేను భావిస్తాను. చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్ కావాలని కలలు కనేదాన్ని. కానీ మోడలింగ్ నాకు మంచి బ్రేక్‌నిచ్చింది. మోడల్‌గా ఎంతో పేరుతెచ్చుకున్నాను. ఇప్పటికీ మోడలింగ్‌లో నేను బిజీగా ఉన్నాను. ఇక అనుకోకుండా మొదట తెలుగు సినిమాలో అవకాశం రావడంతో ‘వెన్నెల’ సినిమా చేసి సినీ రంగ ప్రవేశం చేశాను. నాకు బిజినెస్‌ఉమన్‌గా పేరుతెచ్చుకోవాలనే కోరిక కూడా ఉంది. ఒకవేళ నేను బిజినెస్ ఉమన్‌గా మారి ఉంటే సినిమాల్లోకి అస్సలు వచ్చి ఉండేదాన్ని కాదు.
డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. కానీ సినీ రంగంలో నా కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటాను. అందాల తారలు మధురీ దీక్షిత్, శ్రీదేవి, ఊర్మిళ స్థాయిలో గ్లామర్ తారగా వెలుగొందాలని అనుకుంటున్నాను. ఇక సినిమాల్లో ఫలానా క్యారెక్టర్ చేయాలని నేనేమి అనుకోవడం లేదు. నా బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఎటువంటి రోల్స్ బాగుంటాయో సినీ నిర్మాతలు, డైరెక్టర్లు నిర్ణయిస్తున్నారు. ఇక నాకైతే గ్లామరస్ రోల్స్ ఎక్కువగా చేయాలని ఉంది.
నా అందచందాలు, గ్లామర్ అంతా మా అమ్మ నుంచి వచ్చినవే. మా అమ్మ గొప్ప అందగత్తె. చిన్నప్పటి నుంచి ఆమెను చూసి పలు విషయాలను నేర్చుకునేదాన్ని. అమ్మ ఎప్పుడూ నాకు గైడెన్స్ ఇస్తుండేది. చక్కగా డ్రెస్సింగ్ చేసుకోవడం, అందంగా అలంకరించుకోవడం అమ్మే నాకు నేర్పించింది. మోడలింగ్‌లో రాణించడంతో పాటు సినిమాల్లో వచ్చేందుకు అమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించింది.
|