మసాలా
 
 
 
 
సినిమా రీటేక్ పెళ్ళిళ్ళు
ఒకనాటి సావిత్రి...విజయనిర్మలనుంచి నేటి నయనతార దాకా దక్షిణాదిలో సినీతారలు ద్వితీయ వివాహం చేసుకునే సంస్కృతి పెరిగిపోయింది. బాలీవుడ్‌లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే దక్షిణాదికి కూడా బాగానే పాకింది.

అయితే టాలీ వుడ్‌లో ఈ ధోరణి తక్కువేనని చెప్పాలి. నయనతార ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సివచ్చింది. ప్రభుదేవా, నయనతారల మధ్య సంబంధంపై ప్రభుదేవా భార్య రమాలత్‌ కోర్టుకెక్కడం... ఆ తర్వాత కాంప్రమైజ్‌ కావడం...మొదటి భార్యకు భరణం ఇస్తానని కోర్టు ఎదుట ఒప్పుకోవడంతో నయనతార, ప్రభుదేవాల వివాహానికి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లయింది. ఒకప్పటి సావిత్రి అప్పటికే పెళ్లయిన జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌లను తన అందాలతో ఉర్రూతలూగించిన శ్రీదేవి అప్పటికే పెళ్లయి, పిల్లలున్న దర్శకనిర్మాత బోనీకపూర్‌ను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు. నటుడు కమల్‌హాసన్‌తో గౌతమి సహజీవనం చేస్తోందిప్పుడు. ప్రముఖ నటి రాధిక అప్పటికే పెళ్లయి పిల్లలున్న నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. రాధిక పెద్ద బిజినెస్‌ మ్యాగ్నెట్‌. టీవీ సీరియళ్ల నిర్మాణంలో ఆమెది అందె వేసిన చేయి.

సూపర్‌ స్టార్‌ కృష్ణ, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల జంట గురించి తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో కృష్ణ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి అప్పటికే వారి వారి జీవిత భాగస్వాములతో పిల్లలు కూడా ఉన్నారు.ఇక, అమల, నాగార్జునల పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. శివ సినిమాతో మొదలైన వీరి పరిచయం తర్వాత పరిణయానికి దారితీసింది. వారిరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగి 1992లో పెళ్లి చేసుకున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా అదే బాటలో నడిచాడు. ఆయన విశాఖపట్నం నగరానికి చెందిన నందినికి విడాకులు ఇచ్చి తనతో కలిసి నటించిన రేణుదేశాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

ఫ్యాషన్‌ డిజైనర్‌ పోనీవర్మను ప్రకాష్‌రాజ్‌ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పటి అందాల తార జయప్రద కూడా సినీ నిర్మాత శ్రీకాంత్‌ నహతాను పెళ్లిచేసుకుంది. నహతాకు అప్పటికే పెళ్లయిపోయింది. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు వివిధ రంగాలలో రాణించడం కూడా విశేషం. కొంతమంది నిర్మాతలుగా, మరికొందరు ఫ్యాషన్‌ డిజైనర్లుగా మరికొందరు లేడీ దర్శకులుగా, వ్యాపార, వాణిజ్య రంగాలలో మంచి పేరు తెచ్చుకోవడం కొసమెరుపు.