తమిళ సినీ పైరసీ నిధులు తీవ్రవాదుల చేతికి వెళుతున్నాయని, సంఘ విద్రోహ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయని కమల్‌హాసన్ ఆరోపించారు. శరత్‌కుమార్ నటించిన 'జగ్గుభాయ్' చిత్రం విడుదలకు ముందే పైరసీ డీవీడీలు రెండురోజుల కిందట చెన్నైలో బయటపడటంతో సినీ పైరసీపై తమిళ చలనచిత్ర నటీనటులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ పైరసీ కారణంగా చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటోందన్నారు.
సినిమాల రీరికార్డింగ్, డబ్బింగ్ పూర్తికాకముందే కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రింట్‌ను పైరసీ చేస్తున్నాయన్నారు. కాగా, సినిమాలను పైరసీ చేసే వారు చిత్ర పరిశ్రమలోనే ఉన్నారని రజనీకాంత్ వెల్లడించారు. ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాధికా శరత్‌కుమార్, దర్శకుడు కె.ఎస్. రవికుమార్, నటుడు సూర్య, నిర్మాత ఆర్.బి. చౌదరి తదితరులు పాల్గొన్నారు.
|