మసాలా
 
 
 
 
ఇకఫై నటించను
ఇకపై కెమెరా ముందుకు వచ్చే అవకాశం లేదని నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా అంటున్నారు. కొరియోగ్రాఫ్‌లో ఇండియన్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కాదలన్ చిత్రంతో నటుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక దర్శకుడిగా తెలుగులో నువ్వొస్తానంటే నేను వద్దంటానా, తమిళంలో పోకిరి, హిందీలో వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో విశాల్, సమీరారెడ్డి జంటగా నటిస్తున్న వెడి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు మీకోసం...

కోల్‌కతాలో వెడి చిత్రం షూటింగ్ అనుభవం?
నేను కోల్‌కతాలో షూటింగ్ చేయడం ఇదే తొలిసారి. హీరోయిన్ సమీరకు ఇక్కడ షూటింగ్ కొత్తేమి కాకపోయినా విశాల్‌కు కూడా తొలి అనుభవమే. కోల్‌కతాను ఓల్డ్ ప్రాంతం అంటుంటారు. అయితే మా చిత్రానికి ఇది చాలా కొత్త లొకేషన్ అవుతుంది. నిజానికి ఈ చిత్రం షూటింగ్‌ను భారతదేశంలో ఎక్కడైనా చేయవచ్చు. ఇక్కడే చేయడానికి మరొక కారణం ఉంది. ఇంతకు ముందు కోల్‌కతాలో చిత్రీకరణ జరుపుకున్న తమిళం, తెలుగు చిత్రాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ మాకు వర్తిస్తుందనుకుంటున్నాం.

ఈ చిత్రానికి దర్శకత్వం మాత్రమే చేస్తున్నారా.. నృత్య దర్శకత్వం కూడానా?
ఈ చిత్రం వరకు నేను దర్శకుడిని మాత్రమే. నృత్య దర్శకుడు వేరే ఉంటారు.

తదుపరి చేయనున్న హిందీ చిత్రం గురించి?
అక్షయ్‌కుమార్ హీరోగా రౌడీరాథోర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాను. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇది పూర్తి కమర్షియల్ ఫార్ములాలో సాగే యాక్షన్ కథా చిత్రం. కిలాడి హీరో కు ఈ చిత్రం మరో సూపర్‌హిట్ అవుతుందని చెప్పగలను. నాకిది రైట్‌టైమ్‌లో వచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నా.

హీరోగా ఎప్పుడు నటి స్తారు?
దర్శకుడిగా పడుతున్న టెన్షన్ చాలు. మళ్లీ హీరోగా నటించి డబుల్ టెన్షన్ అనుభవించాలనుకోవడం లేదు. కాబట్టి ఇకపై కెమెరా ముందుకు రావాలనుకోవడం లేదు.