జగపతిబాబు హీరోగా నటించే వందో చిత్రాన్ని తమ విశాఖ టాకీస్ పతాకంపై నిర్మిస్తామని ఆ సంస్థ అధినేత నట్టి కుమార్ తెలిపారు. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి నిర్దేశకత్వం వహిస్తారని
చెప్పారు. సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడులవతుందన్నారు. "మా చిత్ర నిర్మాణ
సంస్థను విశాఖ టాకీస్ ప్రై.లిమిటెడ్ గానూ, మా ఎగ్జిబిషన్ సంస్థను ఎన్.కె.థియేటర్స్ ప్రై.లిమిటెడ్‌గానూ మార్చాం.
ఒక థియేటర్ నుంచి 42 థియేటర్లకు దీన్ని విస్తరింపజేశాం. విశాఖ సాగర తీరంలో రెండేళ్లలో ఎన్.కె.స్టూడియోని నిర్మించబోతున్నాం. కొద్ది రోజుల్లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం
కానున్నాయి. ఇప్పటివరకు 61 చిత్రాలు నిర్మించిన మేము వచ్చే నెల రెండు భారీ సినిమాలు ప్రారంభిస్తున్నాం. వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని ఆయన చెప్పారు. టిక్కెట్ రేట్లు
పెరగడం వల్ల ఎగ్జిబిటర్లకు ప్రయోజనకరమైనా, సాధారణ ప్రేక్షకులకు అవి భారమేననీ, అందుకే ధరల పెంపుని తాము వ్యతిరేకిస్తున్నామనీ ఆయన అన్నారు.
మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "జగపతిబాబు హీరోగా నటించగా ఇటీవల మేం 400 థియేటర్లలో విడుదల చేసిన 'చట్టం' చిత్రం సంతృప్తికరంగా నడుస్తోంది.
మంచి సినిమా అని అందరూ ప్రోత్సహిస్తుండటమే దీనికి కారణం'' అని తెలిపారు.
|