'బుడ్ఢా... హోగా తేరా బాప్'లో ఒక సన్నివేశంలో హీరో విజు (అమితాబ్ బచ్చన్) గ్యాంగ్‌స్టర్ డెన్‌లో అనుచరులందరిని మట్టి కరిపిస్తాడు. ఇక డెన్ నాయకుడు కబీర్ (ప్రకాష్ రాజ్) మాత్రమే మిగులుతాడు. సాధారణంగా హిందీ సినిమాల్లో వచ్చే ఇలాంటి సన్నివేశాల్లో అప్పటిదాకా గంభీరంగా ఉన్న విలన్ ఒక్కసారిగా నీరుగారిపోతాడు. కానీ ఇక్కడ కబీర్‌గా తెరపై కనిపిస్తోంది ప్రకాష్ రాజ్. దాంతో చితకబాదటానికి విజు ఎదురుగా వచ్చిన నిలబడిన సందర్భంలో కబీర్ ముఖంలో పలికే భావాలు, డైలాగ్ డెలివరీ ఏ స్థాయిలో ఉందంటే ఆ సన్నివేశం సినిమా మొత్తానికి అత్యంత హాస్యభరిత సన్నివేశంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
'బుడ్ఢా... హోగా తేరా బాప్' చిత్రంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాష చిత్రాల్లో ప్రతిభావంతుడౖౖెన నటుడు ప్రకాష్ రాజ్‌ను తమకు పనికివచ్చే నటుడిని బాలీవుడ్ కనుగొంది.
అంతకు మునుపు సల్మాన్ ఖాన్ హీరోగా 2009 సంవత్సరంలో వచ్చిన 'వాంటెడ్' (తెలుగులో 'పోకిరి') చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత 'బుడ్ఢా...' చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు.
అజయ్ దేవగన్ హీరోగా, ప్రకాష్ రాజ్ విలన్‌గా 'సింగమ్' చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఆ చిత్రం ప్రొమోలు చూసిన పక్షంలో దక్షిణాది చిత్రాల్లో రెండు దశాబ్దాలుగా పని చేస్తున్న విజయమైంతమైన నటుడి పాత్రకు దర్శకుడు రోహిత్ శెట్టి తగిన న్యాయం చేసినట్టుగా కనిపిస్తుంది.
'''బుడ్ఢా...' చిత్రంలో ఆ పాత్ర చాలా చిన్నదైనప్పటికీ క్లైమాక్స్ సన్నివేశంలో అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడి ఎదురుగా సమతూకం పాటించే మరో నటుడు కావాలి. అందు కోసం ఆ పాత్రకు ప్రకాష్ రాజ్‌ను ఎంచుకున్నాను'' దర్శకుడు పూరి జగన్నాథ్ వివరించారు. అనుకున్నట్టుగానే ఆ సన్నివేశం పండింది.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ''హిందీ సినిమాలు నన్నెక్కడికి తీసుకువెళతాయనేది నాకు తెలియదు. కానీ ప్రస్తుతం నా స్థానాన్ని వెతుక్కునే పనిలో ఉన్నాను. నేను ఒక పక్షి లాంటి వాడిని. సినీ వినీలాకాశం అంచుల దాకా ఎగరాలనుకుంటున్నాను. అందుకే అందివచ్చిన ప్రతి పాత్రలోనూ నటిస్తున్నాను'' అని తెలిపారు.
సూర్య, అనుష్క జంటగా 'సింగమ్' తమిళ వెర్షన్‌లో ప్రకాష్ రాజ్ విలన్‌గా నటించాడు. అదే పాత్రను ప్రస్తుతం హిందీ వెర్షన్‌లో కూడా చేస్తున్నాడు. అయితే హిందీ వెర్షన్ దగ్గరకు వచ్చేసరికి అతడికి ఒక సవాల్ ఎదురైంది. హిందీ 'సింగమ్'లో వ్యాపారవేత్త జయ్‌కాంత్ షిక్రేగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఆ పాత్ర డిమాండ్ చేసినదాన్ని బట్టి అతడు తప్పనిసరిగా మహారాష్ట్ర యాసతో కూడిన హిందీ భాషలో మాట్లాడాలి. ప్రత్యేకించి దర్శకుడు శెట్టి ప్రకాష్‌రాజ్‌తో స్వంతంగా డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించుకున్నాడు.
''ఈ సినిమాలో పవర్‌ఫుల్ డైలాగులుంటాయి. దాంతో భాషకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాను'' అని శెట్టి చెప్పాడు. ''కానీ ప్రతి రోజూ సెట్‌లో స్క్రిప్ట్ రచయితల సహకారంతో డైలాగులను ఇంగ్లీషులో రాసుకొని రిహార్సర్స్ చేస్తూ ఒక విద్యార్థిలాగా ప్రకాష్ రాజ్ కనిపించేవాడు. మధ్య మధ్యలో దీనర్ధం ఏమిటి? దీన్ని ఎలా పలకాలంటూ తన సందేహాలు తీర్చుకునేవాడు. సీనియర్ అయినప్పటికీ ఇదే తన మొదటి చిత్రమన్నట్టుగా ఉత్సాహం ప్రదర్శించేవాడు'' అని శెట్టి వివరించాడు.
కానీ బాలీవుడ్‌లో నటులను ఒకే తరహా పాత్రల్లో నటింపజేసే ధోరణి వేళ్లూనుకుంది. అలాంటి ప్రమాదంలో ప్రకాష్ రాజ్ ఇప్పటికే పడినట్టుగా కనిపిస్తోంది. సినీ విమర్శకురాలు మైథిలీరావు మాట్లాడుతూ ''దక్షిణాదిన విభిన్నమై పాత్రల్లో నటించినప్పటికీ అక్కడి నుంచి వచ్చే నటులుకు ఒకే తరహాపాత్రలను ఇచ్చే ధోరణి బాలీవుడ్‌లో ఉంది. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఆ మూసలో దిగిపోయారు'' అని పేర్కొన్నారు.
అయితే తెలుగు, తమిళ కమర్షియల్ చిత్రాల్లో ఒకే తరహా పాత్రల్లో నటిస్తున్నారనే విమర్శలను ప్రకాష్ రాజ్ ఇప్పటికే చవిచూశాడు. ''నేను ఒకే తరహాపాత్రల్లో నటిస్తున్నానంటూ ప్రజలు చేస్తున్న ఆరోపణలు నిజమే'' అని ఆయన నవ్వుతూ చెప్పాడు. '''వాంటెడ్', 'బుడ్ఢా...' చిత్రాల్లో నేను నటించిన పాత్రల మధ్య తేడా ఏముంది? అంతగా లేదు. ఒకే తరహాపాత్రను 10 చిత్రాల్లో చేయమని నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేయాలి? '' అని అతడు వాదించాడు.
అయితే అన్ని 10 పాత్రల్లో నటించటానికి ఒప్పుకోవద్దని సలహాఇచ్చే శ్రేయోభిలాషులున్నారని ప్రకాష్ రాజ్ తెలిపాడు.
''పాత్రలు ఒకటే కావచ్చు. కానీ డబ్బులు పెరుగుతాయి కదా! దాంతో ఆ అదనపు సినిమాలో నటించటం ద్వారా మా ఇంటికి మరో ఏసీ కొనుక్కుంటాను'' అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు.