'ఒకే విధమైన పాత్రలు చేస్తున్నానేమో ! అన్న అభిప్రాయం కలుగుతోంది. ఒక్కోసారి తెరమీద నన్ను నేను చూసుకొని బోర్
కొడుతుంది. నిజంగా నిజమేమంటే...నా దగ్గరికి వచ్చే పాత్రలన్నీ ఒకే విధంగా ఉంటున్నాయి. పది సినిమాలు చేస్తే...గతంలో
చేసినట్టు ఐదు పాత్రలు ఉంటున్నాయి' అని తన మనసులోని మాటను బయటపెట్టారు ప్రకాష్‌రాజ్. తమిళంలో నిర్మాతగా
'గగనం' నిర్మించారు. నటుడిగా, నిర్మాతగా తన అనుభవాల్ని ఇలా వెలిబుచ్చుతున్నారు.
అన్వేషిస్తున్నాను...
మొనాటమీ నుంచీ బయటపడటానికి ప్రయత్నిస్తున్నా. మంచి సినిమాల కోసం ప్రయత్నిస్తున్నా. అలాంటి చేసినప్పుడే ఓ
'కాంజీవరం', ఓ 'ఆకాశమంత', ఓ 'గగనం' లభిస్తాయి. కొత్త కథల కోసం ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి.
ప్రేక్షకులూ దానికోసమే ఎదురుచూస్తున్నారు. 'హ్యాపీడేస్' అలానే ఆదరించారు. ఈమధ్య వచ్చిన 'అలామొదలైంది' సినిమా కూడా
బాగా క్లిక్ అయింది. ప్రయత్నం లోపం లేకుండా ప్రయోగం చేస్తే ఫలితాలొస్తాయి.
కొనసాగుతూనే ఉంటాడు
అసలు నాతో వ్యక్తిగతంగా పరిచయమే లేకుండా, సినిమా అవకాశాల కోసం ఎదురుచూసే ఓ కొత్త దర్శకుడు...నాలుగు గోడల
మధ్య కథ రాసుకొంటూ...ఫలానా పాత్రకు ప్రకాష్‌రాజ్ అయితే బాగుంటుంది...అని నన్ను ఊహించుకొని ఓ పాత్రకు రూపకల్పన
చేసినంత కాలం... ప్రకాష్‌రాజ్ నటుడిగా కొనసాగుతూనే ఉంటాడు.
ప్రేక్షకుల దృక్పథం మారుతోంది
రొటీన్ కథల్ని పక్కకి తోసేస్తున్నారు. తమ అభిమాన హీరో నటించినా పట్టించుకోవట్లేదు. ప్రేక్షకుల దృక్పతంలో మార్పు
వచ్చింది. పరిశ్రమలో విజయాల శాతం చూడండి...ఎంత తక్కువగా ఉందో. రోజూ ఎన్ని పనులున్నా సినిమా చూడాల్సిందేనని
అనుకోవటం లేదు. నచ్చితేనే చూస్తారు. లేదంటే లేదు.
'గగనం' ప్రేక్షకులను తృప్తిపరుస్తుంది
మనం డబ్బుల కోసం సినిమాలు తీస్తుంటాం. మన తృప్తి కోసమూ కొన్ని ప్రత్యేక కథల్ని ఎంచుకుంటాం. ఆ కోవలో వచ్చిందే...
'గగనం'. నా ఆశలు, ఆశయాలు పక్కన పెడితే, ప్రేక్షకుల్ని తృప్తి పరుస్తుంది. ఇలాంటి కథ, ఇందులోని సన్నివేశాలు ఇంతకు
ముందు వాళ్లెప్పుడూ చూసుండరు. వ్యక్తిగతంగానూ ఇలాంటి స్టోరీ అంటే ఇష్టం. కాబట్టి తమిళంలో ఈసినిమాకు నేనే నిర్మాతగా
వ్యవహరించాను.