మన రాష్ట్రంలోనూ, కర్నాటకలోనూ ఇటీవల సంచలనం సృష్టించిన మైనింగ్ మాఫియాపై కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా
‘పృథ్వి’ అనే చిత్రం నిర్మించారు. మైనింగ్ ముఠాల అక్రమాలు, రాజకీయ అరాచకాలను ఇందులో ప్రముఖంగా చూపించడంతో ఇటీవల
విడుదలైన ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది.
సిన్సియర్ ఐ.పి.ఎస్ ఆఫీసర్ పృథ్విగా నటించిన కన్నడలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో పునీత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ -
వ్యక్తిగతంగా ఏ రాజకీయ నాయకుడినీ టార్గెట్ చేయకుండా, రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా దీన్ని రూపొందించాం. మైనింగ్ దృశ్యాలను
కర్నాటకలోను, మరికొంత భాగం వైజాగ్ లోనూ చిత్రీకరించాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రభావితం చేస్తున్న ఓ ప్రధానమైన అంశంతో
ఈ చిత్రం నిర్మించాం. ఇదొక ప్రయోగంగా చెప్పుకోవాలి. ఇందులో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ప్రజల నుండి
చాలా మంచి స్పందన వస్తోంది - అని అన్నారు. కర్నాటకలో మైనింగ్ యజమానులుగా, కీలక రాజకీయ నాయకులుగా ఎదిగిన గాలి
జనార్థన్ రెడ్డి, అతని సోదరుడు కరుణాకరరెడ్డి వ్యవహారాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీరి అక్రమ మైనింగ్ తో
పాటు రాజకీయ బ్లాక్ మెయిలింగ్ అంశాలు ‘పృథ్వి’లో చూపించారు. రాష్ట్రంలో నడుస్తున్న బి.జె.పి ప్రభుత్వం విధానాలను విమర్శించారు.
‘ధనార్జనకు ప్రభుత్వాన్ని ఓ సాధానంగా వాడుకుంటున్నారు’ అని చెప్పారు. గంగాజలాన్ని సరఫరా చేస్తూ ప్రముఖడయ్యాడంటూ బి.జె.పి
మంత్రి క్రిష్టయ్య శెట్టిని చూపించారు. సమకాలీన కర్నాటక రాజకీయాలను దర్పణం పట్టిన ఈ చిత్రం షూటింగ్ రహస్యంగా జరగడం
విశేషం. ఈ చిత్రం విడుదలకు ఒకవారం ముందు మాత్రమే ప్రచారం ప్రారంభించారు.
ప్రజల సంపద అయిన ఖనిజాలను మైనింగ్ పేరిట కొందరు దోచుకోవడం చూసిన, నిజాయితీగల ఐ.ఎ.ఎస్ అధికారి ‘పృథ్వి’ వీరి
అక్రమాలను అడ్డుకుంటాడు. అయితే ప్రభుత్వంలోని పెద్దలు అతనికి సహకరించరు. పైగా పృథ్వి కింద పనిచేసే అధికారులను బదిలీ చేసి
ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితులలో ‘పృథ్వి’ ఏం చేశాడనేది ఈ చిత్ర కథాంశం. ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత జాకోబ్ వర్ఘీస్
ఈ చిత్రాన్ని నిర్మించారు. కర్నాటక రాష్ట్రమంతటా ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. ప్రజల మన్ననలు పొందుతోంది.
|