‘జీవితాంతం ఒకే జీతంతో ఎవరైనా బతికేస్తారా? ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారికి, ప్రభుత్వోద్యోగులకు ఏడాదికోసారి జీతాలు పెరుగుతుంటాయి కదా. మరి మేం మాత్రం ఏం తప్పు చేశాం. మొదటి సినిమాకు తీసుకున్న పారితోషికాన్నే ఎప్పుడూ తీసుకోలేంకదా’ అంటున్నారు ప్రియమణి. ఈ మధ్య ఆమె పారితోషికం పెంచారని వచ్చిన వార్తలకు ప్రియమణి పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఓ కన్నడ సినిమావుంది. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఇందులో నటించడచానికి ప్రియమణి 40లక్షల రూపాయలు తీసుకున్నారని సమాచారం. కన్నడ రంగంలో ఇంత మొత్తం అంటే ఆషామాషీ కాదు. ఇప్పటి వరకూ కన్నడంలో అత్యథిక పారితోషికం అందుకున్న కథానాయిక ప్రియమణి అని పరిశీలకులు అంటున్నారు. ఆ విషయం గురించి చెబుతూ- ‘కన్నడ పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకున్నది నేనే అనే విషయం నాకు తెలియదు. అసలు అక్కడి కథానాయికలు ఎంత తీసుకుంటున్నారో అనే విషయం కూడా నాకు అవగాహనలేదు. మార్కెట్లో నాకు వున్న డిమాండ్ ను బటి్ట నేను నిర్మాతను ఓ పారితోషికం అడిగాను. ఆయన మరో మాట మాట్లాడకుండా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది 30 లక్షలా? 40లక్షలా? అనేది ఇతరులకు అనవసరం. నిర్మాత సంతోషంగా ఇస్తున్నారు. నేను పుచ్చుకుంటున్నాను. అయినా నేనెప్పుడూ నా తాహతుకుమించి ఎవర్నీ డిమాండ్ చేయలేదు. ఎవరికైనాసరే వారి ప్రతిభకు తగ్గట్టుగానే పారితోషికాలు ముడతాయి. ఊరికే ఎవరికీ ఎవరూ ఏమీ ఇవ్వరు’ అని చెప్పారు ప్రియమణి.
ప్రస్తుతం ప్రియమణి చేస్తున్నవన్నీ మంచి పాత్రలే. డిసెంబర్ 4న విడుదల కానున్న ‘ప్రవరాఖ్యుడు’ చిత్రం తన ఖాతాలో మంచి హిట్ చిత్రంగా నమోదవుతుందనే నమ్మకాన్ని ప్రియమణి వ్యక్తపరుస్తున్నారు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావణ్’ చిత్రంలో నటించడం తన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఆమె అంటున్నారు. హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రం ద్వారా ప్రియమణి బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.
|