Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
జాతీయ ఉత్తమ నటి ప్రియాంక చోప్రా

      'ఫ్యాషన్‌' చిత్రంలోని నటనతో అటు అభిమానులను ఇటు సినీ విమర్శకులను మెప్పించిన బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. మానవ సంబంధాల ఆధారంగా నిర్మించిన బెంగాలీ చిత్రం 'అంతహీన్‌' (దర్శకుడు: అనిరుద్ధరాయ్‌ చౌదరీ) ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకోగా.. 'నాన్‌ కడవుల్‌' (తెలుగులో 'నేను దేవుడ్ని' చిత్రం) చిత్రానికి గాను తమిళ దర్శకుడు బాలకు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం మరాఠీ నటుడు ఉపేంద్ర లిమయేను (చిత్రం: జోగ్వా) వరించింది.

ఇదే చిత్రానికి ఉత్తమ సంగీతం అవార్డు కూడా దక్కింది. 2008 సంవత్సరానికిగాను 56వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శనివారమిక్కడ ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్‌ కరుణ్‌ నేతృత్వంలోని జ్యూరీ 126 ఎంట్రీల నుంచి విజేతలను ఎంపిక చేసింది. అవార్డుల్లో తెలుగువారికి సముచిత స్థానం దక్కింది. తెలుగువారైన ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌కు 'ఫిరాఖ్‌' చిత్రానికిగానూ ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో అవార్డు దక్కగా.. ఉత్తమ నృత్య దర్శకులుగా 'జోధా అక్బర్‌' చిత్రంలోని 'అజీమో షాన్‌ షెహెన్‌షా' పాటకు గానూ చిన్ని ప్రకాష్‌- రేఖా ప్రకాష్‌ జంట ఎంపికైంది. వీరిలో రేఖాప్రకాష్‌ స్వస్థలం విజయవాడ. ప్రాంతీయ భాషాచిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా '1940లో ఒక గ్రామం' ఎంపికైంది. బాలాదిత్య, శ్రీ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నంది నరసింహ దర్శకత్వం వహించారు.

ప్రజాదరణ పొందిన చిత్రంగా హిందీ సినిమా 'ఓయ్‌ లక్కీ.. లక్కీ ఓయ్‌' నిలిచింది. ఫ్యాషన్‌ ప్రపంచంలోని చీకటి కోణాల్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం 'ఫ్యాషన్‌'లో ప్రియాంకతోపాటు నటించిన కంగనా రనౌత్‌ ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని గెలుపొందగా.. 'రాక్‌ ఆన్‌' చిత్రానికిగాను బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. ఉత్తమ నేపథ్య గాయనీ గాయకులుగా శ్రేయా ఘోషల్‌, హరిహరన్‌లు నిలిచారు.కాగా, మలయాళీ, బెంగా లీ చిత్రాల ఆధిపత్యానికి గండి కొడుతూ ఈమారు బాలీవుడ్‌ సినిమాలు అవార్డుల పంట పండించాయి. మొత్తం 13 అవార్డులను కైవసం చేసుకున్నాయి.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005