"దేవుడు దయామయుడు' అంటున్నారు 'ఫ్యాషన్' గాళ్ ప్రియాంక చోప్రా. ఆమె అలా అనడానికి కారణం లేకపోలేదు. కళాకారులందరూ తమ కెరీరలో ఒక్కసారైనా పొందాలని తపనపడే 'జాతీయ అవార్డు'ని ప్రియాంక గెల్చుకున్నారు. 'ఫ్యాషన్' చిత్రానికి ఉత్తమ నటి అవార్డు ప్రకటన విన్న తర్వాత ఆనందంతో ప్రియాంక చోప్రా పై విధంగా స్పందించారు. "చిన్న వయసులోనే ఇంత పెద్ద అవార్డు పొందడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఘనత చిత్రదర్శకుడు మాధుర్ బండార్కర్‌కి దక్కుతుంది. తను దర్శకుడిగాకన్నా నాకు మంచి స్నేహితుడు' అంటున్నారు ప్రియాంక.
ఇంకో విషయం ఏంటంటే.. ఇదే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కంగనా రనౌత్ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు గెల్చుకున్నారు. దాని గురించి ప్రియాంక చెబుతూ- "కంగనాని నేరుగా కలిసి గాఢంగా హత్తుకుంటాను. ఎందుకంటే తను బాగా యాక్ట్ చేయబట్టే నా నటన కూడా ఎలివేట్ అయ్యింది' అని పేర్కొన్నారు ప్రియాంక చోప్రా. 'ఫ్యాషన్'లో మేఘనా మాథుర్‌గా నటించారామె. కష్టాలకు గురయ్యే మోడల్‌గా ఈ చిత్రంలో ప్రియాంక కనబర్చిన నటనకు ఇప్పటికే బాలీవుడ్ వర్గాలు పలు ప్రశంసలు అందించాయి. తాజాగా జాతీయ అవార్డు కూడా రావడంతో ఆమె ఆనందానికి ఆవధులు లేకుండాపోయింది. ప్రియాంక గెల్చుకున్న తొలి జాతీయ అవార్డు ఇది.
అందాల భామలుగా కిరీటాలు గెలుచుకున్నవాళ్లూ... ర్యాంపులపై హొయలుపోయినవాళ్లూ కెమెరా ముందు రాణించలేరు అంటారు. ఈ విమర్శల్నే సుస్మితాసేన్, ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా లాంటి సుందరీమణులు ఎదుర్కొన్నారు. ప్రియాంక 2002లో 'తమిళన్' అనే తమిళ చిత్రంతో రంగుల లోకంలోకి ప్రవేశించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ మరుసటి సంవత్సరం హిందీలోకి ప్రవేశించింది అక్కడా పరాజయాలే పలకరించాయి. అయితే 'ఐత్‌రాజ్'తో నటిగా కాస్త గుర్తింపు వచ్చింది.
ప్రియాంక చోప్రా ఓ తెలుగు చిత్రంలో నటించింది. 'అపురూపం' అనే చిత్రంలో ఆమె కథానాయిక. ప్రసన్న కథానాయకుడు. అయితే ఈ సినిమా విడుదల కాలేదు. 2006లో వచ్చిన 'క్రిష్', 'డాన్' సినిమాలు ప్రియాంకను బాలీవుడ్‌లో స్టార్‌ని చేశాయి. ఆ వరుసలోనే వచ్చిన 'సలామ్ ఎ ఇష్క్' కూడా ఆమెకి ఊరటనిచ్చింది. ఆ చిత్రాలు ఆమెని యువ ప్రేక్షకులకు చేరువ చేశాయి. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలిచ్చే పురస్కారాలు కూడా వరించడంతో ఆమెలో ఆత్మ విశ్వాసం పెరిగిందనే చెప్పవచ్చు.
హిందీ చిత్రసీమలో ప్రియాంకను హాట్‌గాళ్‌గా మార్చిన సంవత్సరం 2008. ఆ యేడాది వచ్చిన రెండు చిత్రాలు ఆమె క్రేజ్‌ని పెంచాయి. అవే... 'ఫ్యాషన్', 'దోస్తానా'. ఇందులో ఆమె హావభావాలు ప్రశంసలు పొందాయి. ముఖ్యంగా మధుర్ భండార్కర్ 'ఫ్యాషన్' ఆమెలోని నటిని చూపించింది. మేఘన మాథుర్ అనే పాత్రలో నటించింది. ఓ చిన్న పట్టణం నుంచి ముంబయి మహా నగరానికి వచ్చి... మోడల్‌గా ఎదగాలనుకొంటుంది. అయితే ఫ్యాషన్ ప్రపంచంలోని వాతావరణాన్ని మేఘన జీర్ణించుకోలేకపోవడం... సర్దుకుపోయే ప్రయత్నంలో ఆమె ఏం కోల్పోయింది... ఉన్నత స్థాయికి ఎదిగాక ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి... అక్కడి నుంచి అథఃపాతాళానికి పడిపోయాక ఎదురైన అనుభవాలు... ఆ కథలో ఉంటాయి. ఆయా సన్నివేశాల్లో ప్రియాంక చూపిన హావభావాలే ఇప్పుడు ఉత్తమ నటిగా నిలబెట్టాయి.
ప్రియాంక అందాల ప్రదర్శనకు అడ్డు చెప్పకుండానే... అభినయానికి ఆస్కారం ఉండే పాత్రల్ని ఎంచుకొంటోంది. 'దోస్తానా', 'కమీనే' చిత్రాలు చూస్తే ఆమె ఎంపిక తీరు అర్థమవుతుంది. 'వాట్స్ యువర్ రాశి'లో 12 పాత్రలు పోషించింది. త్వరలో 'సెవన్ హజ్బెండ్స్'లో ఏడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుందని సమాచారం.
|