మసాలా
 
 
 
 
ఇక్కడా విలన్ గా రాణించాలి
"విలన్ పరిధి ఆకాశమంత. నటన తెలిస్తే చాలు. సరైన అవకాశం వచ్చినప్పుడు తానేంటో నిరూపించుకోవచ్చు. అందుకే నాకు విలన్ పాత్రలంటే చాలా ఇష్టం. తెలుగు పరిశ్రమలో విలన్‌గా నిలదొక్కుకుని అందరి మెప్పూ పొందాలని ఉంది'' అని అంటున్నారు ఆర్.కె. 'వాడు వీడు'లో విలన్ పాత్రలో మెప్పించారు ఆర్.కె. శనివారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ "నా పూర్తి పేరు రాధాకృష్ణన్.

నాకు సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. తమిళంలో ఇప్పటికే నాలుగు చిత్రాల్లో హీరోగా నటించాను. ప్రస్తుతం మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అవి... పి.వాసు 'పులివేషం', షాజి కైలాస్ చిత్రం 'కడమై కన్నియం కట్టుపాడు'. తమిళంలో ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో విలన్‌గా స్థిరపడాలన్నది నా ఆశయం.

'వాడు వీడు' సినిమా కోసం 60 రోజులు పని చేశాను. పాత్ర పండాలని ఏడాది పాటు గడ్డంతో తిరిగాను. బాలా, విశాల్ నాకు మంచి స్నేహితులు. విలన్‌గా నటించాలన్న నా అభిరుచి వారికి తెలుసు కనుక ఆ అవకాశాన్నిచ్చారు. పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. తమిళంలోకి రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో తెలుగులో చాలా సినిమాలు చూశాను.

అందులో ముఖ్యంగా పోలీస్ స్టోరీలు, జగపతిబాబు సినిమాలు, కృష్ణవంశీ సినిమాలు ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో ఏదో వైవిధ్యత కనిపిస్తుంది. అందుకే ఇక్కడ విలన్‌గా నిరూపించుకోవాలన్న తాపత్రయం పెరిగింది. అందుకోసం ఎంతటి హోమ్‌వర్క్ చేయడానికైనా రెడీ. విలనిజంలో నా శైలి ప్రత్యేకంగా ఉంటుందని నా నమ్మకం. పలువురు నన్ను అనుసరించేలా ఉండాలన్నది ఆశయం" అని తెలిపారు ఆర్.కె.