జంట ఆస్కార్‌లతో భారతీయ సంగీతానికి విశ్వవ్యాప్తంగా వన్నెతెచ్చిన స్వరవీరుడు ఎ.ఆర్.రెహమాన్ 'జయహో' పేరుతో
చేసే సంగీత పర్యటన ఈ నెల 11 నుంచి ఆరంభం కానుంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పర్యటనలో దుస్తుల రూపకర్త
ఎవరంటే? రీతూబెరి. ఆమె రూపొందించిన దుస్తులను ధరించి రెహమాన్ దాదాపు ఇరవై నగరాల్లో గొంతువిప్పనున్నారు.
రెహమాన్‌కు మాత్రమే కాదు.. ఆయనతో పర్యటించే మొత్తం బృందానికి దుస్తుల రూపకల్పన చేసే బాధ్యత రీతూదే. మరో
రూపకర్త అమి టింఖమ్‌తో కలిసి రీతూ ఈ పనిలో తలమునకలై ఉన్నారు. ఈ ప్రపంచ పర్యటన కోసం పనిచేయడం ఎలా
ఉందని రీతూని అడిగితే ''రెహమాన్‌లాంటి వ్యక్తి సారథ్యం వహిస్తున్న బృందం మొత్తానికి దుస్తులను రూపకల్పన చేయడం
అంటే మాటలు కాదు. ఈ అవకాశం నన్ను వరించినప్పుడు ఎగిరి గంతేశాను. బాధ్యతతో కూడిన ఆనందాన్ని
అనుభవిస్తున్నాను. పని చేస్తున్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. విశ్వవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో మన
భారతీయతను ప్రతిఫలించే విధంగా రూపొందించమని నాకు ప్రత్యేకంగా కబురొచ్చింది. ఆ మేరకు జాగ్రత్తలు
తీసుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇంతకీ రెహమాన్, బృందం ధరించబోయే వస్త్రాలు ఎలా ఉంటాయి? ''దాదాపు 300 వస్త్రాలు.. ప్రతిదీ యువత కోరుకునే
ధోరణులను ప్రదర్శిస్తూనే మన సంప్రదాయాన్ని ప్రతిఫలిస్తుంది. దీని కోసం అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నాం'' అని
అంటోంది రీతూ. ''త్రికరణశుద్ధిగా నేను చేస్తున్న సంగీత పర్యటన ఇది. భారతీయ సంగీతాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి
ఒక్కరికీ వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతోనే దీనికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి పర్యటనలను విజయవంతం చేయడం
కష్టసాధ్యం. కానీ ప్రతిభావంతులైన సభ్యులందరూ నాతో ఉన్నారు. వారందరి పనితనం విశ్వజనులను మెప్పిస్తుందని
ఆకాంక్షిస్తున్నాను'' అన్న రెహమాన్ మాటలు రీతూలో మరింత స్ఫూర్తిని నింపాయనడం అక్షర సత్యం.
|