పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ ఎ.ఆర్.రెహమాన్ మరో సంచలనానికి చాలా దగ్గరలో
ఉన్నారు. 2009లో గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని భారత కీర్తి పతాకాన్ని
ఎగురవేశారు. 2011లోనూ అది పునరావృతమవనుందా ! అన్నది సంగీతాభిమానుల్లో ఆసక్తి
రేపుతోంది. కొత్త సంవత్సరంలో రెహమాన్ బాణీలు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌ను రెండోసారి
కొల్లగొట్టాయి. అంతేగాక ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో సైతం ఆయన మరోమారు చోటు సంపాదించారు.
టాప్-5 నామినేషన్‌లో చోటు దక్కుతుందో లేదో త్వరలోనే తేలిపోతుంది. జనవరి 12తో ఆయన
45వ వసంతంలోకి ప్రవేశించారు. ఏమాత్రం హంగూ ఆర్భాటం లేకుండా, తన పుట్టినరోజు
ఇంటివద్దే జరుపుకున్నారు.
రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, రెండు గోల్డెన్ గ్లోబ్ బహుమతులు
అందుకున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. డానీ బోయల్‌తో తీసిన రెండో చిత్రం '127
హవర్స్'కు కూర్చిన బాణీలు ఆస్కార్ అవార్డును మరోసారి కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు
అంటున్నాయి. 2010 ఎన్నో సంతోషాల్ని మిగిల్చినా, కామన్‌వెల్త్ రూపంలో చేదుమాత్రనూ
రుచి చూడాల్సి వచ్చింది. కామన్‌వెల్త్ గేమ్స్ కోసం ఆయన రూపొందించిన 'స్వాగతం' ఆశించిన
మేరకు అలరించలేదు. అంతేగాక ఈ గీతాన్ని ట్యూన్ చేయడానికి రూ.5 కోట్లు
తీసుకున్నారన్నది కూడా వివాదాస్పదమైంది. అభిమానుల్ని నిరాశపర్చానని, వారికి
క్షమాపణలు చెబుతున్నాని రెహమాన్ కూడా వివరణ ఇచ్చుకున్నాడు.
ప్రఖ్యాత సంగీత కళాకారులతో పనిచేయడానికే
ప్రాధాన్యత...
శాస్త్రీయ సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని కలగలిపి బాణీలు కూర్చడం రెహమాన్ తరహా.
ముఖ్యంగా బీట్ పాటను మింగేస్తుందన్నది కొంతమంది చెబుతున్న మాట. ఇప్పటివరకూ
ఆయన కూర్చిన బాణీలు ఆరు భాషల్లో సంచనాలు సృష్టించాయి. 100కు పైగా చిత్రాలకు
ట్యూన్స్ అందించారు. 15 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. రోజా, దిల్‌సే, తాళ్, లగాన్, జోధా
అక్బర్, ఢిల్లీ 6, రావన్ గీతాలు అభిమానుల ఇళ్లలో చోటు సంపాదించాయి. టైమ్ మ్యాగజైన్
'మోజార్ట్ ఆఫ్ మద్రాస్' అని కీర్తించింది. గతకొన్నేళ్లుగా రెహమాన్ అంతర్జాతీయ ప్రాజెక్టులపై దృష్టి
సారించారు. తాజాగా బ్రిటిష్ గాయకుడు, గేయ రచయిత డిడోతో కలిసి పనిచేస్తున్నారు.
అంతేగాక ప్రపంచప్రఖ్యాత సంగీత కళాకారులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
సెలైన్ డియోన్, లయోనల్ రీచీ, బార్బరా స్ట్రియోసాండ్, పుస్సికాట్ డోల్స్, ఎకన్ వంటి ప్రఖ్యాత
మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అనుభవాన్ని సంపాదించారు.