దశాబ్దంన్నర పాటు తెలుగు శ్రోతల హృదయాల్లో ప్రియరాగాలను పలికించిన స్వర ద్వయం- రాజ్-కోటి. పదిహేనేళ్ల క్రితం విడిపడిన ఈ రాగాల జంట మళ్లీ కలిసింది. ‘తెలుగు చిత్ర పరిశ్రమపై స్వరాల వాన కురిపిస్తాం’ అంటోంది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయాలని ఎందుకనిపించింది? అనడిగితే -‘‘దానికి మేం ఏదో సమాధానం చెప్పొచ్చు. కానీ అలా చెప్పం. ఎందుకంటే అది కేవలం దైవ నిర్ణయం అంతే..’’ అన్నారు.
ప్రస్తుతం ఉన్న యువ సంగీత దర్శకుల వేగాన్ని అందుకోగలమనే నమ్మకం మీకుందా అనడిగితే... దానికి కోటి సమాధానమిస్తూ -‘‘మా శిష్యుల్లోనే చాలామంది ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. మళ్లీ ఇప్పుడు వాళ్లకు మేం పోటీ ఇవ్వబోతున్నాం. మరి గెలుపు ఈ గురువులదో, లేక శిష్యులదో కాలం సమాధానం చెప్పాలి’’ అన్నారు. మీ శిష్యుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది అనడిగితే -‘‘హేరిస్ జైరాజ్, శివమణి లాంటి వాళ్లు మళ్లీ మాతో పనిచేస్తాం అని అడిగారు. అంత స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూ కూడా అలా అడగడం చాలా సంతోషం అనిపించింది’’ అన్నారు.
మీ నుంచి ఇక ఎలాంటి పాటలు ఆశించొచ్చు అన్న ప్రశ్నకు సమాధానంగా -‘‘ఒక సాలూరి రాజేశ్వరరావు గారు నేటి ట్రెండ్‌కి అనుగుణంగా సంగీతం అందిస్తే... ఆ పాటలు ఎలా ఉంటాయో, ఒక టి.వి.రాజు గారు మళ్లీ పుట్టి సంగీతం అందిస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో మా పాటలు అలా ఉండబోతున్నాయి. మాస్‌లో నిలిచిపోయిన యముడికి మొగుడు, బాలగోపాలుడు, హలోబ్రదర్ లాంటి ఆల్బమ్స్ మళ్లీ మా నుంచి ఆశించొచ్చు’’ అన్నారు రాజ్-కోటి.