మసాలా
 
 
 
 
‘సుల్తాన్ ది వారియర్’నే ‘కోచ్చడయాన్’గామార్చారా?
రజనీకాంత్ ‘రాణా’ చిత్రం విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. అసలీ చిత్రం సెట్స్ మీదకు వెళుతుందా?... ఒకవేళ వెళ్లినా రజనీ ఎప్పటిలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారా?... ఇలాంటి సందేహాలవి. ఇవి చాలవన్నట్లు ఆయన రెండో కుమార్తె సౌందర్య ట్విట్టర్‌లో పెట్టిన ఓ వార్త అయోమయానికి దారితీసింది. ‘అందరికీ ఓ ప్రకటన.. నాన్న నటించబోయే చిత్రం ‘కోచ్చడయాన్’కి నేను దర్శకత్వం వహించబోతున్నాను. నాన్నని డెరైక్ట్ చేయనుండటం ఎక్సయింటిగ్‌గా ఉంది’ అని పోస్ట్ చేశారామె. రజనీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని డిసెంబరు 12న ఆరంభించాలని అనుకుంటున్నారట. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లేను దర్శకుడు కేఎస్ రవికుమార్ అందించనున్నారట. ‘రాణా’ చిత్రాన్ని ఈయన దర్శ కత్వంలో రూపొందించాలనుకున్నారు. ఇక సౌందర్య చేసిన తాజా ప్రకటనతో ఇక ‘రాణా’ లేనట్లేనని కొంతమంది నిర్ధారించుకుంటున్నారు.

మరికొంతమందేమో... రజనీకాంత్ జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు రెండు, మూడేళ్ల క్రితం సౌందర్య ఆరంభించిన ‘సుల్తాన్ ది వారియర్’నే ‘కోచ్చడయాన్’గా పేరు మార్చి విడుదల చేయబోతున్నారని భావిస్తున్నారు. వారు అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. ఇది హై-టెక్ 3డి మూవీ అని సమాచారం. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇంకా ఈ చిత్రం షూటింగ్ ఆరంభమే కాలేదు. 3డి మూవీ అంటే.. షూటింగ్‌కి చాలా సమయం పడుతుంది. కేవలం 8,9 నెలల్లో షూటింగ్ ముగించడం అంటే సామాన్య విషయం కాదు. అందుకే ‘సుల్తాన్ ది వారియర్’నే ‘కోచ్చడయాన్’గా పేరు మార్చి విడుదల చేయబోతున్నారని ఊహిస్తున్నారు. ‘సుల్తాన్...’కి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించింది కూడా సౌందర్యే. అయితే ఈ చిత్రం అర్ధాంతరంగా ఆగింది. ఇక ఈ చిత్రం గురించి పక్కన పెడితే... అసలు ‘రాణా’ ఉందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ విషయాన్ని కూడా సౌందర్య తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేస్తారని రజనీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.