Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
రియాల్టీ షో "రాఖీ న్యాయం"

      టెలివిజన్‌ ఛానల్‌లో ఒక విధమైన సంచలనానికి తెరలేపిన రియాల్టీషో ‘రాఖీ కా స్వయంవర్‌’ గురించి ప్రేక్షకులు మరిచిపోలేరు. అందులోనూ ఆ షో నిర్వహించిన బాలీవుడ్‌ ఐటం గళ్‌ ‘రాఖీ సావంత్‌’ను కూడా వారు అంత తొందరగా మరిచిపోలేరు. ఆ షోతో రాఖీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళా సంఘాల నుంచి అనేక రకాల విమర్శలు వచ్చినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా టెలివిజన్‌ చరిత్రలోనే ఒక నూతన ఒరవడిని సృష్టించిన కార్యక్రమం ‘రాఖీ కా స్వయంవర్‌’. ఆ సంచలనాన్ని మరిచిపోక ముందే రాఖీ మరో వినూత్న కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈసారి స్వయంవరం పేరుతో కాకుండా వివాదస్పద సమస్యలతో బాధపడుతున్న వారికి సలహాలు ఇచ్చేందుకు గాను ‘రాఖీ కా ఇన్సాఫ్‌’ పేరుతో ఈ కార్యక్రమం త్వరలోనే బుల్లితెర మీదకు రానుంది. ‘మీ సమస్యలను పరిష్కరిస్తుంది’ అనేది ట్యాగ్‌లైన్‌.

హత్యలు, దొంగతనాలు, డ్రగ్స్‌, వివాహేతర సంబంధాలు ఇలా ఎలాంటి సమస్యలున్నా సరే ఐటం గళ్‌ రాఖీసావంత్‌ను సంప్రదిస్తే చాలు వెంటనే పరిష్కరిస్తుంది. అవును ‘రాఖీ కా ఇన్సాఫ్‌’ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం అదే. ఇలాంటి వివాదస్పద అంశాలపై ఒక రియాల్టీ షోను నిర్వహించడం టెలివిజన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో ఈ కార్యక్రమంపై ఇప్పటికే ప్రేక్షకులు అత్యంత ఆసక్తి కనపరుస్తున్నారు.

హత్యలు, దొంగతనాలు, డ్రగ్స్‌, వివాహేతర సంబంధాలు వంటి వివాదస్పద అంశాలతో బాధపడుతున్న వారికోసం రాఖీ ఈ కొత్త అవతారం ఎత్తింది. ఇమేజైన్‌ టెలివిజన్‌ ఛానల్‌లో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

‘ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. ఈ కార్యక్రమం గురించి వినగానే నేను చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. ఈ కార్యక్రమం ద్వారా నేను సాధారణ పౌరులతో కూడా ఫేస్‌ టూ ఫేస్‌ మాట్లాడే అవకాశాన్ని సొంతం చేసుకుంటాను. ఈ కార్యక్రమం ద్వారా వారి సమస్యలను నా స్టైల్‌లో పరిష్కరించడానికి కృషి చేస్తాను ’అని రాఖీ ధీమాగా చెబుతోంది.

ఈ 31 సంవత్సరాల బాలీవుడ్‌ సుందరి తన ముక్కుసూటి సమాధానాలతోనూ, మాటకారి తనంతోనూ ఎప్పుడు మీడియాలో కనపడడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఎత్తిన కొత్త అవతారానికి ఎంత వరకు న్యాయం చేస్తుందనే విషయమే సర్వత్రా చర్చనీయాంశమైంది.

‘నాకు న్యాయసూత్రాలు తెలియవు. అయితే నా మనసుతో ఎలా ఆలోచించాలో బాగ తెలుసు. ఈ విషయంలో నేను ఎలాంటి న్యాయసలహాలు ఎవరికీ ఇవ్వను. అయితే వారి సమస్యలను మాత్రం సామరస్య పూర్వకంగా వింటాను. వాటి పరిష్కారానికి నాకు బెస్ట్‌ అనిపించినంత వరకు వారి సమస్యను పరిష్కరిస్తాన’ని రాఖీ చెప్పింది. మొత్తం మీదా మరో సంచలనానికి తెర తీయడానికి సిద్ధమవుతున్న రాఖీ ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తుందో వేచిచూడాల్సిందే.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005