మసాలా
 
 
 
 
గుర్తుండి పోయే సినిమాలు రెండు చేసినా చాలు : రానా
సినిమా చేయకుండా ఖాళీగా ఉంటె నామోషీగా ఫీల్ అయ్యే మనస్తత్వం కాదు నాది. సినిమా తర్వాత సినిమా అని కాకుండా.... మంచి సినిమా తర్వాత మంచి సినిమా అనే పద్ధతి లో వెళ్లాలని అనుకుంటున్నాను. రొటీన్ సినిమాలు , రెగ్యులర్ సినిమాలు పది చేసే కన్నా గుర్తుండి పోయే సినిమాలు రెండు చేసినా చాలు అనేది నా సిద్ధాంతం -అని అంటున్నాడు రామానాయుడు మనవడు రానా.

వ్యక్తిగతంగా నేను అన్నీ ప్లాన్ చేసుకునే చేస్తాను. అయితే హిందీ చిత్రం 'దమ్ మారో దమ్' విషయంలో మాత్రం అలా జరగలేదు. ఏదో కలలా జరిగి పోయింది. 'లీడర్‌' విడుదల కన్నా ముందే ఈ ఆఫర్ వచ్చింది. 'షోలే' తీసిన సంస్థ కనుక అందులో చిన్న పాత్ర అయినా చెయ్యాలనుకున్నాను. తీరా చూస్తే నాది హీరో పాత్ర. అభిషేక్ బచ్చన్ ఒక హీరో అయితే నేను ఒక హీరో. బిపాసా బసు నాకు జంటగా చేస్తుందని చెపితే నిజంగా షాక్ అయ్యాను. లీడర్ ద్వారా నేను నేర్చుకుంది ఆచరించడానికి ఇందులో మంచి అవకాశం లభించింది.

నేను పుట్టింది, కొంతవరకు చదువుకుంది మద్రాస్ లో కనుక, తమిళ్ సినిమాలో చేయాలని కోరిక ఉంది. 'లీడర్‌' నే తెలుగు- తమిళ్ లో చెయ్యాలను కున్నాము. కాలేదు . ఆ తర్వాత సెల్వ రాఘవన్ తో ఓ చిత్రం ప్లాన్ చేసాము. అదీ కాలేదు. బహుశా త్వరలో నేను చేసే చిత్రం రెండు భాషల్లో ఉంటుంది. అలాగే 'దమ్ మారో దమ్' ఫలితాలను బట్టి హిందీ సినిమాల్లో చేసే విషయం నిర్ణ యించుకుంటాను. ఇక హాలీవుడ్ లోను ఓ చిత్రం చర్చల్లో ఉంది. బాలీవుడ్, హాలీవుడ్ లో నాకు అవకాశాలు రావడానికి నా ఎత్తు, పర్సనాలిటీలే కారణం.

ప్రస్తుతం మన పరిశ్రమలో ఫిలిం మేకర్స్ తగ్గిపోయి, ప్రపోజల్ మేకర్స్ పెరిగి పోయారు. పాపులర్ హీరోలు, దర్శకులు దొరికితే చాలు ...సినిమా ప్రారంభించేస్తున్నారు. స్క్రిప్ట్ విషయం పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా బాధాకరం. పూర్తి స్క్రిప్ట్ తో ఇప్పుడు ఎంతమంది షూటింగ్ చేస్తున్నారో చెప్పమనండి. తాతయ్య, నాన్న, బాబాయి పూర్తి స్క్రిప్ట్ లేకుండా సెట్స్ కి వెళ్లరు. అదే అలవాటు నాకూ వచ్చింది.

ఇలియానా తో పూరి జగన్ దర్శకత్వంలో నేను చేసిన ' నేను నా రాక్షసి' వచ్చే నెల మూడవ వారం విడుదల చేయాలనుకుంటున్నాము. ఇందులో నా పాత్ర పూరి జగన్ స్టైల్ లో ఉంటుంది .