మసాలా
 
 
 
 
రెహ్మాన్‌ బయోగ్రఫీ... 'స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌'
ఆస్కార్‌, గ్రామీ అవార్డులు అందుకున్న మ్యూజిక్‌ మాస్ట్రో ఎ.ఆర్‌.రెహ్మాన్‌. సుమధురమైన సం గీతాన్ని అందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారు ఆయన. ఈ మ్యూజిక్‌ లెజెండ్‌ అభిమానులు త్వరలో ఆయన జీవిత విశేషాలను తెలుసుకునేందుకు రెహ్మాన్‌ బయోగ్రఫీ పుస్తకం విడుదలవుతోంది.‘ఎ.ఆర్‌.రెహ్మాన్‌ ద స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ పేరిట రూపుదిద్దుకున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత నస్రీన్‌ మున్నీరాశారు.

ఎ.ఆర్‌.రెహ్మాన్‌ జీవితంలోని ఆయా దశలు, వివిధ సంఘటనలు తెలుసుకుసుకునేందుకు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ ద స్పిరిట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ పుస్తకాన్ని రాశారు నస్రీన్‌ మున్నీ. మొజార్ట్‌ ఆఫ్‌ మద్రాస్‌గా పేరు గాంచిన రెహ్మాన్‌ బయోగ్రఫీ పుస్తకాన్ని వచ్చేనెల 6వ తేదీన ప్రముఖ సినీ దర్శకులు మణిరత్నం విడుదల చేయనుండడం విశేషం. ‘రెహ్మాన్‌ బయోగ్రఫీ పుస్తకాన్ని పబ్లిష్‌ చేసేందుకు అవకాశం రావడం మాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాము. మ్యూజిక్‌ మాస్ట్రోగా రెహ్మాన్‌ ఎదిగిన తీరు గురించి ఈ పుస్తకంలో రాశారు. రచయిత నస్రీన్‌ మున్నీ మూడు సంవత్సరాల కాలంలో ఈ పుస్తకాన్ని రాయడంలో మునిగితేలారు. ఈ పుస్తకంతో పాటు రెహ్మాన్‌ పాటలతో కూడిన సిడిని మొదటి ఎడిషన్‌తో పాటు ఉచితంగా అందజేస్తున్నాము’ అని ఓమ్‌ బుక్స్‌ ఇంటర్నేషనల్‌ పబ్లిషర్‌ అజయ్‌ మాగో అన్నారు.ఇక రెహ్మాన్‌ తన మ్యూజిక్‌ కెరీర్‌ను టివిలలో యాడ్స్‌కు సంగీతాన్ని అందిస్తూ ప్రారంభించారు.

చివరికి 1991లో మణిరత్నం రూపొందించిన రోజా సినిమా రెహ్మాన్‌కు పెద్ద బ్రేక్‌ నిచ్చింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా రెహ్మాన్‌ సినీ రంగంలో పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దూసుకుపోయారు. తన జీవిత విశేషాలతో కూడిన బయోగ్రఫీ విడుదల కానుండడం పట్ల ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంతోషంగా ఉన్నారు.చిన్నప్పుడు జరిగిన సంఘటనలతో నస్రీన్‌ ఈ పుస్తకాన్ని చాలా చక్కగా రాశారని చెప్పారు. 45 సంవత్సరాల రెహ్మాన్‌కు 2008లో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను రెండు ఆస్కార్‌ అవార్డులు దక్కిన విషయం విదితమే. దీంతో పాటు అదే సినిమాకు ఆయనకు రెండు గ్రామీ అవార్డులు సైతం దక్కాయి.