Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘రోబో’కు 30 కోట్లు

      విడుదలకు ముందే... రికార్డు బద్దలు! తెలుగు డబ్బింగ్ కు ఫుల్లు కలెక్షన్!! ఇది... సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న ‘రోబో’ సృష్టించిన రికార్డు!! ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా డబ్బింగ్ హక్కులు రూ.30కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు సినీ చరిత్రలో ఓ డబ్బింగ్ సినిమాకు గతంలో ఎన్నడూ లేనంత ధర పలికింది ‘రోబో’కే!! గతంలో ‘శివాజీ’ సినిమాను రూ.15 కోట్లకు కొన్నప్పుడే.. సినీపరిశ్రమ వర్గాలు కళ్లు తేలేశాయి. ఇప్పుడు దానికి రెట్టింపు ధరతో రోబో హక్కులను సొంతం చేసుకున్నారు ప్రముఖ పంపిణీ సంస్థ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిల్మ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు. ‘రోబో’ ధర రూ.30 కోట్లు పలుకుతోందంటూ ఇప్పటికే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు అనువాద హక్కుల కోసం తెలుగు చిత్ర రంగానికి చెందిన ముగ్గురు నిర్మాతలు పోటీ పడ్డారు. శంకర్ గత చిత్రం ‘శివాజీ’ని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత, పంపిణీదారుడు బెల్లంకొండ సురేష్ రూ.20 కోట్లు చెల్లించేందుకు ముందుకు రాగా, మరో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు రూ.23కోట్లు, రూ.26 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిసింది. అయితే, రూ.30 కోట్లకు పైసా కూడా తగ్గేది లేదని ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ స్పష్టం చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే, సాహసోపేతంగా ‘రోబో’ను భారీ ధరకు కొనుగోలు చేసిన టీటీవీ అధినేత శ్రీనివాసరావును పలకరిస్తే - ఆయన ఏమన్నారంటే.. ‘‘దర్శకుడు శంకర్ పై నమ్మకముంది. అంతేకాదు... రజనీ, ఐశ్వర్యారాయ్, శంకర్ లు సినీ లోకంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. శంకర్ తీసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఆ నమ్మకంతోనే ‘రోబో’ను కొన్నాను’’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 500 నుంచి 600 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని, మొదటి వారం లోనే పెట్టుబడులు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మొదటి వారంలోనే భారీగా వసూళ్లు ఉంటాయని భావిస్తున్నందున పైరసీ ప్రమాదం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. తమిళ చిత్రానికి సంబంధించిన తెలుగు అనువాద హక్కులను తొలుత రూ.15 కోట్లు.. ఆ తర్వాత 30 కోట్లకు కొనుకోలు చేసిన రెండు సినిమాలూ ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించినవే కావడం విశేషం.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005