| ఆర్.పి.పట్నాయక్. 'చిత్రం', 'నువ్వునేను', 'జయం',
'సంతోషం', 'ఆ నలుగురు' లాంటి విజయవంతమైన చిత్రాలకు బాణీలు
అందించారు. నటుడిగా కెమెరా ముందుకొచ్చారు... 'శీను వాసంతి
లక్ష్మి'తో. ఆ తరవాత కెమెరా వెనక్కి వెళ్లి 'స్టార్ట్ కెమెరా యాక్షన్' అన్నారు
'అందమైన మనసులో' చిత్రంతో! ఆ సినిమా తరవాత ఆర్పీ దర్శకత్వంలో
వస్తున్న చిత్రం 'బ్రోకర్'. పాలన వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన పవర్ బ్రోకర్ వ్యవస్థ
చుట్టూ తిరిగే కథ ఇది. ఈ చిత్రం గురించి ఆర్పీ పట్నాయక్ మాటల్లో...
''మనకు మార్కెట్‌లో కనిపించే దళారీనో, ప్రభుత్వ కార్యాలయం దగ్గర
కనిపించే మధ్యవర్తో... మొత్తం అవినీతికి కారణం అని అనలేం. అవినీతి అనేది
ఏ విధంగా వ్యవస్థీకృతమైపోతోందనే విషయాన్ని మా చిత్రంలో చూపించాం. వ్యవస్థను
సమూలంగా నాశనం చేసే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతోంది. కుర్చీలను సైతం
కదిల్చే శక్తి ఈ దళారీలకు ఉంది. ఇక్కడ మోసం చేసేవాడి గురించి మాత్రమే చెప్పడం
లేదు. మోసపోయేవాడూ మా సినిమాలో ఉన్నాడు. ఇద్దరూ తమను తాము
చూసుకొంటారు''.
''సమాజాన్ని పీడిస్తున్న అవినీతి నేపథ్యంలో ఒక సినిమా
తీయాలన్నదిఎప్పట్నుంచో నాకున్న ఆలోచన. ఆ ప్రయత్నంలోనే కొన్ని రోజులు
గడిచిపోయాయి. ఒక రోజు మా బంధువుతో మాట్లాడుతుండగా... అతనికొచ్చిన
ఫోన్‌కాల్ ఈ కథకు మూలమైంది. ఉద్యోగం చేస్తున్న తను మరో చోటకు బదిలీ
కావాలనుకొన్నాడు. ఆ విషయంపై పవర్ బ్రోకర్లతో బేరాలు సాగిస్తున్నాడు. వాటి
తీరుతెన్నులు, ఆ బ్రోకర్లు ఏ స్థాయి వారో తెలుసుకొన్నాను. అప్పుడు ఎన్నో
విషయాలు తెలిసొచ్చాయి. మంచికీ, చెడుకీ... ప్రతి పనికీ రేటు
కడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే తంతు. వాటి ఆధారంగా అల్లుకున్న కథ
ఇది''.
''నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఇందులో నటించడం లేదు.
నూటికి నూరుపాళ్లు పాత్ర డిమాండ్ చేయడంతోనే మరోసారి తెర ముందుకొచ్చాను.
సినిమాలో నాది ప్రధాన పాత్రే అయినా ప్రతినాయక ఛాయలుంటాయి. కార్యాలయంలో
అధికారికీ, అవసరానికొచ్చిన సామాన్యుడికీ వారధిగా నిలిచి విఘ్నాలు
తొలగిస్తుంటాను. నిజ జీవితంలో నాకు మందు తాగే అలవాటు లేదు. ఈ సినిమా
చూశాక నేను మందు తాగనంటే ఎవరూ నమ్మరు. అంతలా ఉంటుంది నా
నటన''.
''నిజాన్ని నిజాయతీగా చూపించే ప్రయత్నం చేశాం. గుమ్మడికాయ దొంగ
అంటే భుజాలు తడుముకొనే పరిస్థితులున్నాయి. ఎవరి మీదో కావాలని ఎక్కుపెట్టిన
చిత్రం కాదు. మన సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూపిస్తున్నాం.
దర్శకుడిగా, నటుడిగా నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. సరిగమలతోనే నేను
పరిశ్రమకు పరిచయమయ్యాను. వాటిని వదిలి ఎక్కడికీ వెళ్లను. తప్పకుండా
మంచి కథలను ఎంచుకొని సంగీత బాధ్యతలు నిర్వర్తిస్తాను''.
|