మసాలా
 
 
 
 
మట్టి గణనాథుల ప్రచారంలో సల్మాన్‌
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు గణనాథుడంటే భక్తి ఎక్కువ. ప్రతి ఏటా వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటూ వినాయకుడికి ఆయన పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ బాలీవుడ్‌ హీరో వినాయకచవితి పండుగ రోజున ఎకో-ఫ్రెండ్లీగా ఉండే గణనాథుల ప్రతిమలను ప్రతిష్టించాలని ప్రజలకు పిలుపునిస్తారు. గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనాథ పిల్లలను ఆదుకోవాలని, పచ్చదనానికి కృషి చేయాలని కోరుతున్న సల్మాన్‌ వినాయకచవితి పండుగ రోజున పర్యావరణానికి హాని కలగని గణనాథులను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేసే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ వినాయక చవితి పండుగ వేడుకల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటూ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయనకు వినాయకుడంటే భక్తి, ప్రవృత్తులు ఎక్కువే. ఈసారి వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకొని ఎకో ఫ్రెండ్లీ గణేష్‌ విగ్రహాలను ఆయన ప్రమోట్‌ చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికుడిగా మారిన సల్మాన్‌ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎకో ఫ్రెండ్లీ గణనాథులను ఏర్పాటుచేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, కెమికల్స్‌తో కూడిన రంగులతో తయారుచేసిన వినాయక విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని బంకమట్టితో తయారై ప్రకృతిసిద్ధ రంగులతో అలంకరించిన గణనాథుల ప్రతిమలను పండుగ రోజున ప్రతిష్ఠించుకోవాలని సల్మాన్‌ ప్రజలకు బోధిస్తున్నారు. ఇందుకోసం సల్మాన్‌ టీ -షర్ట్‌లకు కూడా విడుదల చేశారు. ‘బీయింగ్‌ హ్యూమన్‌’ అని ముద్రించిన ఈ టీషర్ట్‌లను ప్రజలకు ఉచితంగా పంపిణీచేస్తున్నారు. ఇక తన కొత్త సినిమా బాడీగార్డ్‌ ప్రమోషన్‌లో భాగంగా కూడా కొన్ని టీ షర్ట్‌లను రూపొందించారు. వీటిలో సామాజిక ప్రయోజనాలతో కూడిన స్లోగన్స్‌ను ముద్రించి ప్రజలకు అందజేస్తున్నారు.