మసాలా
 
 
 
 
ఆ బాధ్యత నాపై ఉంది
దబాంగ్‌, వాంటెడ్‌, రెడీ, బాడీగార్డ్‌... విజయాలతో సల్మాన్‌ మంచి ఊపు మీదున్నాడు. తాజాగా విడుదలైన 'బాడీగార్డ్‌' రికార్డ్‌ కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. దక్షిణాది చిత్రాలను రీమేక్‌ చేస్తూ, సల్లూ భారు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. బాడీగార్డ్‌ విడుదలకు ముందు మీడియాతో సల్మాన్‌ ముచ్చటించిన సంగతులు ఇలా ఉన్నాయి...

* నేనెప్పుడూ ఒకే విషయం చెబుతాను. ముందుగా మనం ఎన్ని ఊహించుకొన్నా, వాటన్నింటికీ సరైన సమాధానం సినిమా విడుదలైన రోజున మాత్రమే దొరుకుతుంది. బాడీగార్డ్‌ విషయంలోనూ నేను ఇదే విషయాన్ని నమ్మాను. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేనీ కథను ఎంచుకున్నా. చక్కటి రొమాంటిక్‌, ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లే పక్కాగా కుదిరింది కాబట్టే, క్లిక్‌ అవుతోంది. ఇలాంటి చిత్రాలను చూడ్డానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారన్న నమ్మకంతోనే చేశాను.

* లార్జర్‌ దెన్‌ లైఫ్‌...తరహా చిత్రాలనే చేస్తున్నాను. అలాంటి సినిమాలంటే కేవలం ఫైట్లు మాత్రమే కాదు. కామెడీ, డ్రామా, భావోద్వేగాలు ఇవన్నీ సమపాళ్లలో ఉండాలి. ఇవన్నీ పండించినప్పుడే ఒక నటుడు, ఒక కథానాయకుడు నిపించుకుంటాం. అయితే బాలీవుడ్‌ కథానాయకుడు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాడు. కానీ ఆ స్థాయిలో మన సినిమాలు మారటం లేదు.

* ఒకప్పటి యాంగ్రీ యంగ్‌మేన్‌ ఇప్పుడు ఫ్యామిలీ కథలతో వస్తున్నాడు. ఫ్యామిలీమేన్‌ అవుతున్నాడు. టీనేజ్‌ కథలు చేసిన కథానాయకుడు ఇప్పుడు లార్జెర్‌ దెన్‌ లైఫ్‌ సినిమాలతో వస్తున్నాడు. ఇలా ప్రతీ ఏడెనిమిదేళ్లకొకమారు కథానాయకుడు మారుతున్నాడు.

* ఎలాంటి తరహా కథలను ఎంచుకోవాలో తెలియక గందరగోళ పడే పరిస్థితి ఇండిస్టీలో ప్రతీ ఒక్కరికీ వస్తుంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టేవరకూ అన్ని సినిమాలూ ఒకేవిధంగా ఉన్నాయనిపిస్తుంది.

* దబాంగ్‌ చిత్రానికి సీక్వెల్‌ తప్పకుండా తీస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాం. మొదటి చిత్రం ఎక్కడ ఆగిపోయిందో, రెండో సినిమా అక్కడ్నుంచే ఆరంభమవుతుంది. మొదటి చిత్రంలో ఉన్న పాత్రలన్నీ ఇందులోనూ ఉంటాయి. చుల్‌బుల్‌ పాండే ఒక పెద్ద ప్రాంతానికి బదిలీ అవుతాడు. ఎక్కువ డబ్బు, ఎక్కువ రాబిన్‌హుడ్‌గిరీ అన్నమాట.

* నిజ జీవితంలో చూడని పోలీస్‌ పాత్రలను తెరపై చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఔజార్‌, పత్తేర్‌ కీ పూల్‌, గర్వ్‌ తదితర చిత్రాలు గతంలో నేను కూడా చేశాను. ఖాఖీ, సింగమ్‌ చిత్రాలను అజరుదేవ్‌గన్‌ చేశాడు. మనం చేసిన అన్ని చిత్రాలూ ఆకట్టుకోవు.

* నా దృష్టిలో సల్మాన్‌ ఒక నటుడు మాత్రమే. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి తగిన వినోదం చూపించాల్సిన బాధ్యత నాపై ఉంది. డబ్బు పెట్టి వస్తున్న ప్రేక్షకుడ్ని నేనెప్పుడూ దృష్టిలో ఉంచుకుంటాను. అందుకు తగిన విధంగానే సినిమా ఉండేట్టు జాగ్రత్తపడతాను.