Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
నా నైజమే అంత!

      * ఇరవై ఏళ్లుగా ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాను. కారణం... సినిమాలూ, వివాదాలూ. నా సినిమాల గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఇక వివాదాలంటారా... నా నైజమే అంత. ఆ క్షణానికి తోచింది చేస్తాను, అది తప్పని తెలిస్తే క్షమించమని అడగడానికి సందేహించను. నేను పూర్తిగా మంచివాణ్ని కాదు. నేనే కాదు ఎవరూ పూర్తిగా మంచివారు కాదు. అయితే నా జీవితం అభిమానులకి ఓ పాఠం కావాలి. పెద్ద స్టార్‌నైనా నన్నూ జైల్లో సాధారణ ఖైదీలానే ఉంచారు. మొదటిరోజు అక్కడి టాయిలెట్‌లోకి వెళ్లొచ్చి మూడు రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్టలేదు. జైలు అధికారులు నా మీద ఫిర్యాదు చేస్తే. ముందు ఆ బాత్‌రూమ్‌ శుభ్రం చేయండని చెప్పా. జైళ్ల పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది. రెండు కేసుల్లో ఇప్పటికీ కోర్టుకు హాజరవ్వాల్సి వస్తోంది. సల్మాన్‌కే ఇవి తప్పలేదంటే సామాన్యులకి తప్పుతాయా అని ప్రజలు గ్రహించాలి. నన్ను చూసైనా జంతువుల్ని వేటాడటం, తాగి వాహనాలు నడపటం వంటివి తగ్గుతాయనుకుంటా.

* నేనూ ఐపీఎల్‌ జట్టును కొనాలనుకుంటున్నాను. బిడ్‌ దాఖలు చేస్తాను. అయితే అది దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ విషయంలో షారుఖ్‌ను ఫాలో అవుతున్నాననుకోవద్దు. బిజినెస్‌ కోసం అతడు ఇక్కడికి వచ్చాడు. నేనూ రావాలనుకుంటున్నాను. సినిమాల్లోకి ముందు వచ్చింది నేనే. అలా అతడు నన్ను ఫాలో అయినట్టా? లేకపోతే మేం అమిత్‌జీ, దిలీప్‌సాబ్‌లను అనుకరించామా? ఈ మధ్యనే తెలిసింది షారుఖ్‌ నాకంటే నెలరోజులు పెద్దని. ఇంకా నయం పుట్టుకలోనూ అతడ్ని ఫాలో అయ్యానని ప్రచారం చేయలేదు. షారుఖ్‌తో నాకు ప్రత్యేకించి వైరం ఏమీ లేదు. అభిప్రాయ భేదాలున్నాయంతే. మా కుటుంబ సభ్యుల్లో కొందరు అతడికి మంచి స్నేహితులు. వాళ్లెవరికీ నేను అడ్డుచెప్పను. కొన్ని విషయాల్లో అతడు రైట్‌, మరికొన్ని సార్లు నేను రైట్‌ కావొచ్చు. మేం కలిసి పనిచేయడానికి ఇప్పటికైనా రెడీ. నా గర్ల్‌ఫ్రెండ్‌ కత్రినాని కూడా అతడితో సినిమా చేయొద్దని చెప్పలే. అయినా అది ఆమె లైఫ్‌, ఆమె కెరీర్‌, ఆమె ఇష్టం. ఒక్క వివేక్‌ ఒబెరాయ్‌తో మాత్రం నటించొద్దని చెప్పా. అతడు చాలా నాటకాలాడతాడు. తర్వాత పొరపాటైందంటాడు.

* హిందూ-ముస్లిం పట్టింపులు నాకు పెద్దగా లేవు. ప్రేక్షకులు నన్నో ముస్లింలా చూడరు. 'మా సల్మాన్‌, మా అభిమాన హీరో' అనుకుంటారు. ఓ హిందూ యువతి మా ఇంటికి కోడలిగా వచ్చింది. మా చెల్లి అల్వీరా కూడా ఓ హిందువునే పెళ్లిచేసుకుంది. అతని పేరు అతుల్‌ అగ్నిహొత్రి. చాలా మంచి వ్యక్తి. అతడంటే నాకెంతో గౌరవం. మంచి భర్తగా, తండ్రిగా ఉండలేని వ్యక్తి ముస్లిం అయినా నేను సమర్థించను. దేశంలోని 90 శాతం ముస్లిమేతరులు కూడా నన్ను ఎంతో ఆదరిరంచి అభిమానించారు. అందుకే వీటి గురించి నేను పెద్దగా పట్టించుకోను.

* చాలా మంది అమ్మాయిలు సడన్‌గా వచ్చి పెళ్లిచేసుకోమని అడుగుతారు. నాకైతే ఎలా స్పందించాలో అర్థం కాదు. కొంతమంది రక్తంతో ప్రేమలేఖలు రాస్తారు. ఎందుకొచ్చిందిలే అని అభిమానుల ఉత్తరాలకు స్పందించడం మానేశాను. నాకు సినిమాల్లో తప్ప బయట రొమాన్సంటే తెలియదు. క్యాండిల్‌లైట్‌ డిన్నర్లు అంటారు... చీకట్లో ఎలా తినగలం చెప్పండి. పువ్వులూ చాక్లెట్లూ ఇవ్వడం రొమాన్స్‌ అనుకుంటే అది నాకు నచ్చదు. ఏదో ఒక రోజు వాటిని కొనే స్తోమత నాకు ఉండకపోవచ్చు. అంటే నాకు తను దూరమైపోతుందా? నా ఉద్దేశంలో రొమాన్స్‌ి అంటే ...మనం ఇష్టపడే అమ్మాయితో కష్టసుఖాలను పంచుకోవడం, ఆపదలో అండగా ఉండడం. జీవిత కాలంలో ప్రేమలో పడటం ఒక్కసారే అనే కాన్సెప్ట్‌కు నేను వ్యతిరేకం. మందులకూ మనుషులకూ ఎక్స్‌పైరీ డేట్స్‌ ఉన్నట్టే ప్రేమకూ ఉంటాయి. మళ్లీ కొత్త ప్రేమలు పుడతాయి. ప్రేమికులు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఒకరంటే ఒకరికి బోర్‌ కొట్టకూడదు. 'నాకు కొంత స్పేస్‌ కావాల'ని అంటున్నారంటే... ఆ కథ ముగుస్తున్నట్టే.

* పెళ్లి చేసుకోవడమంటే చాలా విషయాల్లో రాజీకి సిద్ధం కావాలి. అందుకే ఆలోచిస్తున్నా! నేను చేసుకోబోయే అమ్మాయి సంప్రదాయబద్ధంగా ఉండాలి, అలాగే ఆధునికతను ఒంటబట్టించుకోవాలి. పెళ్లి ఎప్పుడంటే... కిందటేడాది అడిగినపుడు ఈ యేడాదని చెప్పాను. ఇప్పుడైతే 2011 అని చెప్పగలను. అప్పుడు మళ్లీ ఆలోచిస్తా. నాకు పిల్లలంటే ప్రేమ. టైమ్‌ దొరికితే తమ్ముడి పిల్లలతో సరదాగా ఆడుకుంటాను. నేను మంచి తండ్రినవుతాననడంలో సందేహం లేదు. కానీ మంచి భర్త కాగలనని గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకో అలా అన్పిస్తోంది. నాకు నేను బాస్‌లా ఉండాలనుకుంటా. భార్యగా వచ్చినామె నాపై పెత్తనం చెలాయిస్తే నాకు ఇష్టం ఉండదు. కత్రినా నాకు భార్యగా వస్తే మంచిదే. లేదంటే కచ్చితంగా ఆమెకది తీరని లోటవుతుంది. అలాంటి లోటు ఆమెకు ఉండకూడదనీ, మంచి భర్త, చురుకైన పిల్లలూ ఉండాలనీ దేవుణ్ని కోరుకుంటాను. నా గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరికీ ఇలానే కోరుకున్నాను. నా ఇల్లు అంత పెద్దది కాదు. నా అవసరాలు కూడా తక్కువే. అదనపు డబ్బు ఉంటే విలాసాలు అలవాటవుతాయి. ఆ డబ్బేదో పేదలకు ఖర్చు చేస్తే మంచిదని 'బీయింగ్‌ హ్యూమన్‌' ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దానిద్వారా పేదలకు నాకు చేతనైనంతలో సాయం చేస్తున్నాను.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005