మసాలా
 
 
 
 
చాలా తీయని అనుభవం
ప్రభుదేవా దర్శకత్వంలో నటించడం తీయని అనుభవమని అంటున్నారు నటి సమీరారెడ్డి. విశాల్, సమీరారెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం వెడి. ప్రభుదేవా దర్శకుడు. ఈ చిత్రం సన్ పిక్చర్స్ ద్వారా ఈ నెల 30న విడుదలకానుంది. వెడి తనకు స్పెషల్ చిత్రమంటున్న సమీరారెడ్డితో చిన్న ఇంటర్వ్యూ...

వెడి పూర్తి యాక్షన్ చిత్రమంటున్నారు. నిజమేనా?
అది నిజమే. సెంటిమెంట్, కామెడీ వంటి జనరంజక అంశాలు కూడా అందులో ఉన్నాయి. నేను బెంగాలీ యువతిగా నటించాను. కోల్‌కతా వచ్చిన విశాల్‌తో ఏర్పడిన పరిచ యం ప్రేమగా మారుతుంది. తర్వాత జరిగిన మలుపులే వెడి చిత్ర కథ. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ప్రభుదేవా దర్శకత్వంలో నటిం చిన అనుభవం గురించి?
చాలా తీయని అనుభవం. ఇచ్చు ఇచ్చు ఇచ్చు కొడు అనే పాటలో నటించడానికి మొదట చాలా భయపడ్డాను. చాలా స్పీడ్ పాట అది. ప్రభుదేవానే ధైర్యం చెప్పి స్టెప్స్ వేయించారు. చాలా కష్టపడ్డాను. ఈ పాటకు చాలా మంచి పేరు వస్తుంది.

తమిళంలో నాలుగు చిత్రాలు చేశారు. కోలీవుడ్‌పై మీ అభిప్రాయం?
హిందీ, తెలుగు చిత్రాల్లో నటించినా చెన్నైనే రెండవ సొంత ఊరుగా భావిస్తాను. తమిళ ప్రేక్షకులు నాపై అంతగా అభిమానాన్ని చూపిస్తున్నా రు. వారణం ఆయిరం తర్వాత ఇక్కడి అభిమానులతో అంత అనుబంధం ఏర్పడింది. అందుకే తమిళ చిత్రాలకే ప్రాధాన్యతనిస్తున్నాను.

మీరు, అమలపాల్ అక్కాచెల్లెళ్లయ్యారట?
వేట్టై చిత్రంలో మేమిద్దరం నటిస్తున్నాం. అమలాపాల్‌కు అక్కగా నటిస్తున్నాను. ఇద్దరం పోటీపడి నటిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో స్పాట్‌లో మేమిద్దరమే ఉండాల్సిన పరిస్థితి. అందుకే మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ప్రస్తుత హీరోయిన్లు గ్లామర్‌కే పరిమితమైపోతున్నారు అనడంపై మీ అభిప్రాయం?
అన్ని చిత్రాల్లోనూ అలాగేనని చెప్పలేం. కొన్ని చిత్రాల్లో మాత్రం మీరు చెప్పింది నిజమే. నేను నటించిన చిత్రాలన్నింటిలోనూ నా పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. ఒక్క విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి. హీరోల ఆధిపత్యమే అధికం.. దీన్ని అధికమించలేము కూడా.

తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం హిందీలో తేజ్ చిత్రంలో నటిస్తున్నాను. తమిళంలో ఒక చిత్రాన్ని అంగీకరించాను. ఈ విషయాలు త్వరలో చెబుతాను.