మసాలా
 
 
 
 
కష్టానికి ఫలితం దక్కింది
''తమిళ చిత్రాలు బాగా తీస్తున్నారు. ఆ దర్శకులంటే మనవారు తక్కువేంకాదు. తెలుగులో గొప్ప దర్శకులున్నారు. అవకాశాలు కుదరడంలేదు. ఎక్కడో అడ్డంకి ఉంది. కొద్దిరోజుల్లో అది క్లియర్‌ అవుతుందని'' వర్థమాన దర్శకుడు సంతోష్‌ శ్రీనివాసన్‌ చెబుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌ నుంచి దర్శకుడయి 'కందిరీగ' చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు.

తొమ్మిది చిత్రాలు వదులుకున్నా..
పుట్టి పెరిగింది వైజాగ్‌లో.. రాజమండ్రిలో తాతగారు 'రౌతుపబ్లికేషన్‌' నడిపేవారు. స్వతహాగా గుర్తింపురావాలనే సినిమాటోగ్రాఫర్‌ అవ్వాలనుకున్నా. అలా చెన్నై వెళ్ళి తోటరామకృష్ణ ద్వారా బి.గోపాల్‌ దగ్గర పనిచేశాను. వయస్సు తక్కువ కాబట్టి ఫొటోగ్రఫీ నేర్చుకోమనడంతో విన్సెంట్‌ దగ్గర పనిచేశాను. ఆ తర్వాత టక్కరి, ఖతర్నాక్‌, రెయిన్‌బో చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశాను. అసలు గోల్‌ దర్శకత్వం. అందుకే ఏడాదిన్నరపాటు కథను తయారు చేయడానికి గడిపాను. ఈలోగా కెమెరామెన్‌గా వచ్చిన తొమ్మిది అవకాశాలు వదులుకున్నాను. స్క్రిప్ట్‌ రెడీ అయ్యాక బెల్లంకొండ సురేష్‌ను కలసి చెప్పడంతో సింగిల్‌ సిటింగ్‌లో ఓకే చేశారు.

బాలచందర్‌ ప్రభావం ఉంది
నాపై దర్శకుడు కె. బాలచందర్‌ ప్రభావముంది. కుటుంబ సంబంధాలు బాగా డీల్‌ చేయగలరు. కమర్షియల్‌ దర్శకుడిగా కె. రాఘవేంద్రరావు అంటే ఇష్టం. ఆయనకు ఏకలవ్యశిష్యుడ్ని. మూడు సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశాను. కందిరీగకు ఎంత ఖర్చయినా పర్వాలేదని బెల్లంకొండ సురేష్‌ ధైర్యం చెప్పారు. ఆదిలోనే విఘ్నాల్లాగా... ఇండిస్టీలోని రెండుసార్లు సమ్మెపోటు పడింది. ఆ సమయంలో కాస్త భయమేసినా... సినిమా తీసి పూర్తిచేశాం. ప్రేక్షకుల స్పందన తర్వాత పడిన కష్టానికి ఫలితం దక్కిందనే తృప్తికల్గింది.

కొత్తకథల్లేవు..
సినిమాకు కొత్తగా కథలనేవి లేవు. పెద్దలంతా అన్నీ తీసేశారు. స్క్రీన్‌ప్లే కొత్తగా చెప్పగలగడమే మేం చేసేది. 'కందిరీగ' చిత్రం రెండు, మూడు సినిమాలు కలిపి కథ రాశారనే విమర్శ ఉంది. ఎన్ని కథలు రాసినా... సెకండాఫ్‌లో వచ్చే ఎపిసోడ్‌ కత్తిమీద సాము. విలన్‌ హీరోయిన్‌ను తీసుకెళ్ళకుండా మరో విలన్‌ కోటలో హీరో ఉండి... కథను రక్తికట్టించడం హైలైట్‌. సెకండాఫ్‌కే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీకాకుళంనుంచి నెల్లూరు వరకు వెళ్ళిన విజయయాత్రంలో మేం గమనించింది అదే.

ప్రముఖ హీరోతో చిత్రం
రెండవ చిత్రం మళ్ళీ బెల్లంకొండసురేష్‌ నిర్మాతగా ప్రముఖ హీరోతో ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం. మూడవ చిత్రం అల్లు అర్జున్‌తో ఉంటుంది. హీరోయిన్‌, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలు తెలియజేస్తాం' అన్నారు.