మసాలా
 
 
 
 
గుంటూరులో సావిత్రి విగ్రహావిష్కరణ
'ఆంధ్రుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానటి సావిత్రి. నటనే దైవంగా భావించిన తపస్వి' అని పలువురు వక్తలు మహానటి సావిత్రిని కొనియాడారు. ఆదివారం గుంటూరులో ప్రముఖ సినీ నటి కీర్తిశేషులు సావిత్రి విగ్రహావిష్కరణ సభ జరిగింది. కళాదర్బార్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక నాజ్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహాన్ని సినీనటుడు కృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయంత్రం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు ఆయన సభలో మాట్లాడుతూ సావిత్రి క్రమశిక్షణ కలిగిన నటి అనీ, నటనే దైవంగా భావించేవారనీ చెప్పారు. కళాకారులు చనిపోయినా ప్రజల హృదయాల్లో చిరకాలం ఉంటారనీ ఆమె నిరూపించారన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ మాట్లాడుతూ సావిత్రి నటన వల్లే ఆయా సినిమాలు ప్రజాదరణ పొందాయని చెప్పారు. తాను విద్యార్థి దశలో సావిత్రి నటించిన సినిమాలు బాగా చూసేవాడినన్నారు. సినీ నటి రాధిక మాట్లాడుతూ సావిత్రి స్మారక పురస్కారం అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కొత్త నటులకు సావిత్రి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఈ కార్యమ్రంలో ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మస్తాన్‌వలి, సావిత్రి సమీప బంధువు విజయ ఛాముండేశ్వరి, కళాదర్బార్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పొత్తూరి రంగారావు, సంస్థ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.