మసాలా
 
 
 
 
షమ్మీకపూర్‌ చివరి మాటలు
బతెరపైనే కాదు, తెరవెనకా ఆత్మీయ అనుబంధాల్ని పెనవేసుకున్న బాలీవుడ్‌ నటుడు షమ్మీకపూర్‌. కెమెరా ముందు విషాదం, వినోదం పండించటం ఒక ఎత్తు. నిజ జీవితంలో వాటితో పయనించటం మరొక ఎత్తు. రొమాంటిక్‌ హీరోగా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న షమ్మీ కపూర్‌ జీవితంలోకి విషాదం ప్రవేశించింది. కిడ్నీ సమస్యలతో వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యారు. ఆ సమయంలో కూడా జీవితాన్ని సానుకూలంగానే తీసుకొని, తనదైన లోకాన్ని సృష్టించుకున్నారు. కంప్యూటర్‌ టెక్నాలజీని ఆలంబనగా చేసుకొని, ఎంతోమంది నూతన నటీనటులతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయన కిడ్నీ సమస్యతో ఆదివారం మృతి చెందారన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం మీడియాతో చివరిసారి షమ్మీకపూర్‌ ముచ్చటించారు. ఆ విశేషాలు...

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఎలా తట్టుకుంటున్నారు ?
జీవితం చాలా గొప్పది. ఆనందంగా, అందంగా నడుస్తోంది. జీవించి ఉండటం అన్నిటికన్నా ముఖ్యమైంది. ఏడేళ్లుగా డయాలసిస్‌ జరుగుతోంది. నాలో ఉన్న ఉత్సాహాన్ని అదేమీ చంపలేదు. చనిపోయే సమయం వచ్చినా, ఆనందంగానే పోతా.

జీవితంలో 'యాహూ...'అనే సంఘటన ?
తుమ్సా నహీ దేఖా, దిల్‌ దేకే దేఖో, జంగ్లీ...సినిమాలు హిస్టరీ క్రియేట్‌ చేశాయి. రెబల్‌ స్టార్‌గానే కాకుండా, రొమాంటిక్‌ స్టార్‌గానూ గుర్తింపు దక్కింది. జీవితం మాంచి హుషారుగా నడిచిన రోజులవి.

అమీర్‌ఖాన్‌తో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది. కారణం ?
అమీర్‌ఖాన్‌ అంకుల్‌ నాజిర్‌ హుస్సేన్‌తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. తీస్రీ కసమ్‌, తుమ్సా నహీ దేఖా, దిల్‌ దేకే దేఖో సినిమాలు ఆయన దర్శకత్వంలోనే వచ్చాయి. నా కళ్ల ముందు పెరిగిన కుర్రాడు అమీర్‌ఖాన్‌ . నటుడిగా అమీర్‌ ఎదిగిన తీరు నాకు గర్వకారణం. అనేక సందర్భాల్లో అతను నన్ను కలుస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమన్నాడంటే...'ఎల్విస్‌ ప్రెస్లీ ఆఫ్‌ ఇండియాగా... షమ్మీకపూర్‌ను చెప్పుకుంటాం. కానీ అది సరికాదు. షమ్మీకపూర్‌ ఆఫ్‌ అమెరికా...అని ఎల్విస్‌ ప్రెస్లీని చూడాలి' అంటూ అభిమానం కురిపించాడు.

ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా మిమ్ముల్ని చెప్పుకుంటారు...?
అందులో నాదేమీ లేదు. నేను చేయాల్సింది చేశాను. ఒపి.నయ్యర్‌, శంకర్‌-జైకిషన్‌ వంటి సంగీత దర్శకులు లేకపోతే నేను చూపింది పనిచేసేది కాదు. అంతేగాక నాలో ఉన్న ఎనర్జీని దర్శకులు చక్కగా ఉపయోగించుకున్నారు. కొన్ని ప్రయోగాలు చేశాను. వారు ప్రోత్సహించారు. ముఖ్యంగా రొమాంటిక్‌ సన్నివేశాల్లో చాలా అమాయకమైన చూపులు విసిరేవాణ్ని. అది బాగా క్లిక్‌ అయింది.

కుంప్యూటర్‌కు బానిసై పోయారంట ?
1988 నుంచి ఈ అంశంపై దృష్టి పెట్టడం ప్రారంభించాను. చాలా సంవత్సరాల క్రితమే హార్డ్‌వేర్‌ కొనుగోలు చేశాను. ఎన్నో సాఫ్ట్‌వేర్‌ లాంగ్వేజెస్‌ గురించి తెలుసుకున్నా. దీన్ని హాబీ అనండి, పాషన్‌ అనండి...టెక్నాలజీకి బానిసై పోయాను. అంతేగాక నాకు డ్రైవింగ్‌ అన్నా చాలా ఇష్టం. ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా డ్రైవింగ్‌ చేస్తా.

అవకాశముంటే..వెండితెరపై ఏ హీరోయిన్‌తో నటించాలను కుంటున్నారు ?
మీ ప్రశ్న నన్ను ఇబ్బందుల్లో నెట్టడానికే ! నా వయసు 78 సంవత్సరాలు. ఇప్పుడున్న టాప్‌ హీరోయిన్స్‌ దాదాపు 25 సంవత్సరాలుంటారు. ముంబారులో ఉండాలనుకుంటే...ఇలాంటి ప్రశ్నలకు నన్ను దూరంగా ఉంచాలి.