బాలీవుడ్ బాద్షాగా అందరి మన్ననలూ అందుకున్న ఈ హీరోకు కొన్ని సమస్యలొచ్చిపడుతున్నాయి. తెరపై అయితే అవలీలగా అన్నిటినీ చీల్చిచెండాడే కథానాయికుడికి, నిజ జీవిత కథానాయికుడికి చాలా తేడా ఉందనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించానని షారూకే అంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో షారూక్ వ్యాపారరంగంలోకి, సినీ నిర్మాణరంగంలోకి దిగారు. ఇందులో ఆయన కొన్ని చేదు ఫలితాలు రుచి చూడాల్సి వచ్చింది. దీని గురించి ఆయన 'నటుడిగా అన్ని విధాలుగా గెలిచాను. ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాను. కానీ వ్యాపారవేత్తగా నెగ్గలేకపోతున్నా. నా అంచనాలు, ప్రణాళకలు సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేనో చెత్త వ్యాపారవేత్తను' అంటూ నిరాశనిస్పృహలతో మాట్లాడారు.
కోల్కతా నైట్రైడర్స్ జట్టు యజమానిగా అనుకున్న ఫలితం రాకపోవటంతో, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రస్తుతం ఆయన రా.వన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో ఇది తెరకెక్కుతోంది. 'ఈ సినిమా విషయంలో ఎన్నో అంచనాలున్నాయి. అన్ని వయసులవారికీ నచ్చేలా ఉంటుంది. అయితే పైరసీ భయం వెంటాడుతోంది. అకాన్ పాట అప్పుడే నెట్లోకి వచ్చేసింది. అలాగే హ్యాకర్లూ భయపెడుతున్నారు. తప్పకుండా వీటిని తట్టుకుంటాను' అని తెలిపారు.
|