'షూటింగ్‌లో ఉండగా 2008లో భుజం వద్ద గాయమైంది. ఆ నొప్పి తట్టుకోలేకపోయాను.
గత సంవత్సరమే శస్త్రచికిత్స జరిగింది. దానికి సంబంధించి ట్రీట్‌మెంట్ పొందుతున్న
సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యా. దాన్నుంచి ఇప్పుడు పూర్తిగా బయటపడ్డా. చాలా
ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. కొన్ని విషయాల్లో నా మనసులోని భావాల్ని స్పష్టంగా
బయటికి చెప్పలేకపోయా'నని అంటున్నారు బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్. కెరీర్ కొనసాగిన
తీరు వివరిస్తూ, 2011లో రాబోయే చిత్రాల గురించి ఇలా తెలుపుతున్నారు...
చాలా భిన్నమైన పాత్రలు చేశాను. తెరపై అద్భుతంగా దూసుకెళ్లాను. కానీ నా
వ్యక్తిగత విషయం వచ్చేసరికి, మనోభావాల్ని వెలుబుచ్చే కళ నాలో లోపించింది. నిజానికి
నేను...చాలా సిగ్గరి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానూ చాలా తక్కువగా చొరవ
చూపుతాను. ఇది నన్ను కొన్ని విషయాల్లో ఇబ్బందిపెడుతోంది. సహజసిద్ధంగా అబ్బింది
కదా ! అధిగమించలేకపోతున్నా. కొంతమంది పట్ల నాకున్న ప్రేమ, ద్వేషం, స్నేహం,
కోపం...బయట పెట్టలేపోయాను.
ప్రతీదీ పోల్చుకుంటాను !
పోల్చుకోవటం నా జీవితంలో భాగమైపోయింది. పరిశ్రమలోకి ఎవరైనా కొత్త నటుడొస్తే,
పోల్చుకుంటాను. ఏదైనా భారీ హిట్ సాధిస్తే, దాంతో పోల్చుకుంటాను. ఇది కూడా నాలో
ఉన్న సహజగుణం. ప్రస్తుతానికైతే ఇబ్బందిపెట్టడం లేదు. 'జోర్ కా ఝట్కా' అనే టీవీ
కార్యక్రమం ద్వారా మళ్లీ బుల్లితెరపైకి రానున్నా. నేను జీరోగా ఉన్న సమయంలో...టీవీ
ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభమైంది. వెండితెరపైకి పయనించడానికి, ఆ ప్రయాణం ఎంతగానో
తోడ్పడింది. అందుకే బుల్లితెర అంటే చాలా ఇష్టం. ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు
దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నా.
బుల్లితెర...అంటేనే ఇష్టం
1988లో 'ఫాజీ' అనే టీవీ సీరియల్‌లో తొలిసారిగా కనిపించా. ఆ తర్వాత అనేక
ధారావాహిక కార్యక్రమాల్లో నటించా. అజీజ్ మీర్జా 1989లో తీసిన 'సర్కస్' చాలా
పాపులరయింది.
నటుడిగా ఓ రేంజ్‌కు ఎదిగాక, కౌన్ బనేగా కరోడ్‌పతి (2007), క్యా ఆప్ పాంచ్‌వీ పాస్
సే తేజ్ హై (2008)...మొదలైనవాటికి ప్రయోక్తగా పనిచేశా. టెలివిజన్ ఆర్టిస్ట్‌గా,
థియేటర్ ఆర్టిస్ట్‌గా, సినీ ఆర్టిస్ట్‌గా...అన్నిరకాల వేదికలపై కనిపించా. ఇందులో టీవీ
అంటే మక్కువ ఎక్కువ.
బుల్లితెర కార్యక్రమాల్లో వస్తున్న మార్పులని తెలుసుకోలేకపోయా. దాంతో దీనికి
సంబంధించిన నాలెడ్జ్ తగినంత లేదు. టెక్నాలజీ పరంగా, పదజాలం పరంగా నాకు
తెలిసింది చాలా తక్కువ. దాంతో కొంత దూరంగా ఉన్నా. ఎవరైనా టీవీ ప్రముఖుడితో
పనిచేయాలన్నా భయపడేవాణ్ని. కొన్ని సమయాల్లో వారు చేసే విశ్లేషణలు నాకు
అర్థమయ్యేవి కాదు.
మంచీచెడూ...ఉన్న పాత్రలు
చేశా...
1992లో 'దీవానా'తో వెండితెరకు పరిచయమయ్యా. నేను ఏమేమి చేయగలనో అవన్నీ
తెరపై చేశా. అబద్ధాలూ, నిజాలూ రెండూ చెప్పా. నేను చూపినదాంట్లో మంచీచెడు
రెండూ ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఒక్కటిమాత్రం
చెప్పగలను. పని పట్ల నిజాయితీగా వ్యవహరించా. ఇప్పుడు తెలిసిన విషయాలు,
అప్పుడు తెలియవు. నన్ను ఎవరితోనూ పొల్చకూడదనటం...సరైంది కాదు.
పోల్చకుండా ఉంటే మాత్రం సంతోషిస్తా.
నన్ను నేను ఓ నంబర్‌వన్ స్టార్‌గా ఎప్పుడూ భావించలేదు. ఇంకా బాగా చేయాలనే
అనిపించేది కానీ, అద్భుతంగా చేశానన్న తృప్తి ఎప్పుడూ లభించలేదు. అలా అనిపించిన
రోజు నటించడం ఆపేస్తాను. ప్రస్తుతానికైతే...బుల్లితెర, వెండితెర ప్రాజెక్టులు చేతిలో
ఉన్నాయి. రా.వన్, డాన్-2 చిత్రాల షూటింగ్ జరుగుతోంది. అలాగే చేతన్ భగత్
రాసిన 'టు స్టేట్స్' పుస్తకాన్ని విశాల్ భరద్వాజ్ సినిమాగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.
స్క్రిప్ట్‌ను ఎంచుకునే సమయంలో, ఓ ప్రేక్షకుడిలా ఆలోచిస్తా. షారూక్‌ఖాన్ పక్కకు
తప్పుకోవాల్సిందే. సబ్జెక్టులో ఆసక్తికరమై విషయాలు అనేకముండాలి. ఆ విషయాలు ఓ
ప్రేక్షకుడిగా షారూక్‌కు నచ్చాలి. అప్పుడే ఆయా కథల్ని ఎంపిక చేసుకుంటా.
|