|
ముంబయ్‌లోని ఓ ప్రముఖ ప్రాంతం అది. ఆరోజు... అక్కడ పండగ వాతావరణాన్ని తలపించింది. టపాసుల హోరుతో ఆ వీధి మార్మోగింది. దీపావళి పండగ దాటి రెండు వారాలు దాటుతున్నా.. మాకు నిజమైన దీపావళి ఇదే అనే టైపులో టపాసులు కాల్చారు. ఆ ఆనందానికి కారణం... అది బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పుట్టినరోజు! ఆ పండగ రోజు తమదే అన్నట్లుగా షారుక్ అభిమానులు టపాసులతో సందడి చేసి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు.
గత సోమవారం షారుక్ 44వ పుట్టినరోజుని అభిమానులు పై విధంగా జరుపుకున్నారు. కొంతమందైతే విలువైన కానుకలు కూడా బాద్‌షాకి బహూకరించి తమ ఆనందాన్ని చూపెట్టుకున్నారు. ఇక షారుక్ ఎక్స్‌ప్రెషన్‌కొస్తే... ఈ ఏడాది విజయాలపరంగా, ఆర్థికంగా కూడా తను పెద్దగా సాధించింది ఏమీ లేదని అన్నారు. పైపెచ్చు భుజానికి అయిన గాయం కారణంగా ఇంటిపట్టున ఉండి తన కుటుంబ సభ్యులతో గడిపే వీలు దొరికిందని షారుక్ పేర్కొన్నారు. మామూలుగా షారుక్... షూటింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే స్నేహితులకి కాసేపు టైమ్ కేటాయిస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువ. విశ్రాంతి వల్ల కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్నారు కాబట్టి టచ్‌లో లేని స్నేహితులు సైతం ఆరోజు షారుక్ ఇంటికి నేరుగా వెళ్లి బహుమతులు అందించారు.
ఇక అభిమానులు అందించిన కానుకల్లో చెప్పుకోతగ్గది ఒకటుంది. శాండీ అనే అమ్మాయి ఏకంగా చంద్రమండలంలో స్థలం బుక్ చేసి, షారుఖ్ బర్త్‌డే గిఫ్ట్‌గా సమర్పించుకున్నారు. ఈ బహుమతుల ముచ్చట్లు గురించి షారుక్ చెబుతూ -"నా ప్రతి పుట్టినరోజుకీ వాళ్లు అభిమానంతో ఇస్తున్న బహుమతులను ఆనందంగా స్వీకరిస్తా. ఇక మా ఇంటి విషయానికొస్తే.. నా భార్య నాకు ఏ కానుకా ఇవ్వదు. కావాల్సినదానికన్నా నాకు ఎక్కువే ఉన్నాయన్నది ఆమె ఫీలింగ్. మా అబ్బాయి నాకోసం ఓ పుస్తకం కొన్నాడు.
అమ్మాయేమో స్వయంగా తయారుచేసిన ఓ బహుమతి ఇచ్చింది. నాకు బ్యాగ్‌లంటే ఇష్టం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కరణ్ జోహార్ లాప్‌టాప్ బ్యాగ్, మంచి షూస్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రతి ఏడాది పరమేశ్వర్ గోద్రెజ్ ఏదో ఒక బహుమతి ఇస్తారు. ఈసారి కూడా మంచి కానుక ఇచ్చారు. అభిమానులు, స్నేహితులు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ కానుకలు వెల కట్టలేనివి' అన్నారు.
|