|
బాలీవుడ్ కుందనాలబొమ్మ శిల్పాశెట్టి, లండన్ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాల వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. మహిళా వ్యాపారి కిరణ్ బావాకు చెందిన కాండ్లాలోని విశాల భవంతి దీనికి వేదికైంది. దక్షిణాదికి చెందిన మంగళూర్ సంప్రదాయంలో జరిగిన ఈ కల్యాణానికి దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, సునీల్‌శెట్టి, జాకీ భగాని, వాసు భగాని ఉన్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను దూరంగా ఉంచారు. కమనీయంగా జరిగిన కల్యాణమహోత్సవంలో డిజైనర్ తరుల్ తహిల్యాని.. స్వరోవ్‌స్కీ క్రిస్టళ్లతో ప్రత్యేకంగా రూపొందించిన ఎరుపు రంగు వినూత్న చీరను వధువు శిల్ప(34) ధరించారు. అంతకుముందు డిజైనర్ శంతన్, నిఖిల్ రూపొందించిన ముదురు ఎరుపు, బంగారు వర్ణాల మేళవింపుతో తళుకులీనే షేర్వాణిని ధరించి వరుడు రాజ్(33) గుర్రాలు పూన్చిన రథంపై కల్యాణ మండపానికి చేరుకున్నాడు. వివాహానికి ముందు జరిగే 'మెహందీ', 'సంగీత్' తంతులను రాజ్‌కుంద్రా కుటుంబ సంప్రదాయం ప్రకారం పంజాబీ పద్ధతిలో నిర్వహించారు. ఈ వివాహం శిల్పాశెట్టికి మొదటిది. రాజ్‌కుంద్రాకు రెండవది. ఆయనకు గతంలో కవిత అనే మహిళతో వివాహం జరిగింది.
|