మసాలా
 
 
 
 
ఆత్మ విశ్వాసం ముఖ్యం
అందాలభామ శ్రియాసరన్‌ ఇటీవల చెన్నై ఐఐటీ విద్యార్థులకు సినిమాపై లెక్చరిచ్చింది. ఇదేదో ఆషామాషీగా కాదు. చాలా సీరియస్‌గా. మూడు వేలమంది విద్యార్థులు ముందుండగా, ఎలాంటి జంకూ లేకుండా సినిమారంగం గురించి పలు విషయాలు ఉపన్యాసంలో పేర్కొంది. అంతేగాక తన తాజా చిత్రాల సంగతీ చెప్పుకొచ్చింది. దీపామోహతా తీస్తున్న 'విండ్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌'లో ఓ ముఖ్యమైన పాత్ర చేయనుంది. గతంలో కుకింగ్‌ విత్‌ స్టెల్లా, ద అదర్‌ ఎండ్‌ ఆఫ్‌ ద లైన్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలు చేసిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా హాలీవుడ్‌, ఇండియన్‌ సినిమాకున్న తేడాలను ఇలా తెలుపుతోంది...

ఇక్కడి ప్రాంతీయ సినిమాకు, హాలీవుడ్‌కు తేడా ఏంటి ?
ఇండియాలో తీసేవాటికి, హాలీవుడ్‌లో తీసేవాటికి తేడా ఉంటుంది. ముఖ్యంగా ఫిల్మ్‌మేకింగ్‌లో బేధం కనబడుతుంది. ఏం తీస్తున్నామన్నదానిపై దర్శకుడికి పూర్తి అవగాహన ఉంటుంది. అతనికున్న ఐడియాను ఉత్తేజితంగా తెరకెక్కించడానికి ఉపయోగపడే సలహాలను, సూచనలను తీసుకుంటారు. ఇండస్టీలో ఒకమాట తరుచూ అంటుంటారు. అదేంటంటే...స్టూడియోలో ఒకవైపు తలుపులు తీసి ఉంచండని. దానర్థం ఏదో ఒక ఐడియా మన పనిని మరింత సమర్థంతవంతంగా మార్చవచ్చు. కొంతమంది గిరి గీసుకొని కూర్చుంటారు. మరికొంతమంది కావాల్సిన విధంగా ఇతరుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సినిమా షూటింగ్‌ పార్ట్‌ మొదలవకముందు, చాలా హోంవర్క్‌ చేస్తారు. స్క్రిప్ట్‌ రీడింగ్‌, మన రోల్‌ తదితర విషయాల పట్ల ముందే అవగాహన కలిగిస్తారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. భాషతో ఇబ్బంది రావటం లేదా ?
వాటికి సంబంధించిన సహాయకులున్నారు. ఆంగ్ల భాష కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు విధాలుగా యాస ఉంది. దానికి సంబంధించిన ప్రాథమిక శిక్షణ తీసుకుంటే సరిపోతుంది.

కథల విషయంలో ఏమైనా తేడా ఉందా ?
ఇండియాలో నటులకు ఓ ఇమేజ్‌ ఉంటుంది. స్టోరీ చెప్పే విధానం, తెరకెక్కించే విధానం దానికి అనుగుణంగానే జరుగుతుంది. కానీ అదే హీరోయిన్స్‌ విషయానికొస్తే నటనకు చాలా తక్కువ స్కోప్‌ ఉంటుంది. స్టోరీ అంతా కథానాయకుడి చుట్టే తిరుగుతుంది. ఇక్కడా బ్రాడ్‌పిట్‌, లియోనార్డో చుట్టూ నడుస్తుంది. కానీ మనదగ్గరున్నంత కాదు.

బాలీవుడ్‌ కథలు ఎలా ఉంటున్నాయి?
మల్టీఫ్లెక్స్‌ థియేటర్లు వచ్చినప్పటి నుంచీ కొన్ని లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీస్‌ వస్తున్నాయి. ఉదాహరణకు నో వన్‌ కిల్డ్‌ జెస్సికా. దర్శకులు, నటులు చాలా పెద్ద సినిమానే చేయాలన్న తలంపు కనబడుతుంది. కానీ తమిళ్‌ సినిమా వచ్చే సరికి లో బడ్జెట్‌లో చాలా సినిమాలు చేస్తున్నారు.

దక్షిణాదిన చాలా సినిమాలు చేశారు. ఇక్కడ ఏదైనా భాష నేర్చుకున్నారా ?
ప్రతీసారి ఆ ప్రయత్నం జరుగుతుంది. వ్యాకరణం అర్థమవటం కష్టం. దాంతో నా దర్శకుడికి పని ఎక్కువ అవుతుంది. డబ్బింగ్‌ కాకుండా, నా గొంతు వినిపించాలనే ప్రయత్నం చేస్తే, దర్శకుడికి చాలా ఓపిక ఉండాలి. అదో పెద్ద తతంగం అవుతుంది. దానికన్నా సులభంగా వేరొకరితో గాత్రదానం చేయడటమే బెటర్‌.

నటుడవ్వాలనుకునే వారికి ఉండాల్సిన ప్రధాన అర్హత ?
నటించడమొక్కటే కాదు ! ముఖ్యంగా ఇండియాలో ఒక నటుడికి లక్షలు, కోట్ల అర్హతలుండాలి. ప్రతిభ ఉండాలి. సరైన సమయంలో సరైన పాత్ర వేయాలి. చూపాలి. చాలామంది ప్రతిభావంతులు క్లిక్‌ కాని వారెంతోమంది మన చుట్టూ ఉన్నారు. ఈ రంగంలో విజయం దోబూచులాడుతుంది. అన్నికన్నా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది...విజయమైనా, అపజయమైనా సీరియస్‌గా తీసుకోకూడదు. ఆత్మవిశ్వాసంతో నిలబడాలి. 'అది ఫెయిల్‌ అయినా, నేను కొనసాగగలను'అని అనుకోవాలి. మనల్ని మనం పూర్తిగా నమ్మాలి. ప్రోత్సహించుకోవాలి.

ఇండియాలో ఒకస్టార్‌గా ఎదగాలంటే వారసత్వం, పేరు ప్రఖ్యాతలు తప్పనిసరా ?
చాలామంది సూపర్‌స్టార్స్‌కు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో మనకు తెలిసిందే. అది ప్రభావం చూపుతుందా ! లేదా ! అన్నది చెప్పలేను. మా తల్లిదండ్రులు షూటింగ్‌కు పోయినట్టు ఎప్పుడూ చూడలేదు. కానీ ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో వెళితే కొంత ఉపయోగం ఉంది. అది కొంతవరకే. చాలా వేగంగా నేర్చుకోవడానికి పనికొస్తుంది.