|
తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి పేరుని సంపాదించుకున్న హీరోయిన్ శ్రియ. హాలీవుడ్, బాలీవుడ్ ల్లో అడుగు పెట్టినా అక్కడ ఆమెకు అచ్చిరాలేదు. దానితో దక్షిణాది మీదే తన గురిని పెట్టింది. అయితే ఇటీవల ఓ సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ- ‘‘సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక చాలా విచిత్రమైన ప్రశ్నలు మీడియా నుంచి ఎదుర్కొన్నాను. ఒక్కోసారి ఆ ప్రశ్నలు వింటే నాకు నవ్వొచ్చేది. ఎవరడిగినా ఒకేరకమైన ప్రశ్నలు అడిగేవారు. మరి నవ్వురాక ఏమొస్తుంది. హీరోయిన్ గా మీ పొజిషన్ ఏమిటి? దూసుకువస్తున్న సహచర నటుల్ని చూసి మీరు భయపడుతున్నారా?, మొదటిసారి నటిస్తున్నప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? వంటి ప్రశ్నలు వినివిని విసుగెత్తిపోయాను. నిజానికి నాకు ఈ నెంబర్లు, ర్యాంకుల మీద నమ్మకం లేదు. నేను చేసిన సినిమా గురించి, అలాగే అందులో నా పాత్ర గురించి అందరూ మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ నెంబర్ గేమ్ శాశ్వతం కాదు. అలాగే నాకు ఎవరూ ఫోటీకాదు. నేనూ ఎవరికి ఫోటీ కాదు. ఎవరికి తగ్గ పాత్రలు వారికి లభిస్తాయి. ఒకరు చెయ్యాల్సిన పాత్ర మరొకరు చేస్తే నప్పదు. దర్శక, నిర్మాతలు ఆలోచించే ఆ పాత్రకు అవసరమైన కథానాయికను ఎన్నుకుంటారు. ఇక నా రోల్ మోడల్ హేమమాలిని. ఆమె పేరు వినగానే దేశమంతటా ఎలా ఇట్టే గుర్తు పడతారో... నన్ను కూడా అందరూ అలా గుర్తు పట్టాలి. అదే నేను కోరుకునేది’’ అని మనసులోని మాట చెప్పింది శ్రియ.
|