అచ్చ తెలుగు సుందరి స్నేహకు ఈ మధ్యకాలంలో అవకాశాలు సన్నగిల్లాయి. సిసలైన తెలుగుదనంతో భాసిల్లే ఈ సుందరికి కుటుంబ కథా చిత్రాల నాయికగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ వుంది. బాపు దర్శకత్వంలో ‘రాధా గోపాళం’లో నటించే అరుదైన అవకాశాన్ని పొంది బాపు బొమ్మగా మెరిసిపోయింది. తాజాగా ఈ భామ నాగార్జున సరసన ‘రాజన్న’ చిత్రంలో నటిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో వస్తోన్న ఈ చిత్రంపై ఈ ముద్దుగుమ్మ చాలా ఆశల్నే పెట్టుకుంది. అయితే గతంలో మాదిరిగా అవకాశాలు లేనప్పటికీ కెరీర్ విషయంలో చాల సంతృప్తిగా వున్నానంటోంది ఈ వయ్యారి. ‘నటిగా నేనేంటో అందరికీ తెలుసు. నా ప్రతిభను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాల కోసం ఎదురుచూపులు చూడాల్సిన అవసరం నాకు లేదు’ అని చెబుతోంది స్నేహ. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో పై విధంగా స్పందించింది స్నేహ. అంతేకాదు పారితోషికం విషయంలో తనెప్పుడూ కఠినంగా వ్యవహరించనని, మంచి కథలకే తన ప్రాధాన్యత అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం స్నేహ ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.