పదహారణాల అచ్చమైన తెలుగు భామ స్నేహ పెళ్లికి ముస్తాబవుతోంది. తమిళ నటుడు ప్రసన్నతో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న ఈ సుందరి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిచేసుకోబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. జూన్‌లో దాదాపు పెళ్లికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.
‘మేమిద్దరం ఇక ఏ మాత్రం విడివిడిగా వుండలేం. పెళ్లితో నేను కలలు కంటున్న కొత్త జీవితాన్ని ఆరంభించాలని ఆశగా వుంది’ అని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది స్నేహ. ఇప్పటి నుంచే పెళ్లి ఏర్పాట్లలో స్నేహ కుటుంబ సభ్యులు నిమగ్నమై వున్నారని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది సినీ ప్రముఖులందరినీ వివాహానికి ఆహ్వానించాలని స్నేహ సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు. ఎన్నో ప్రముఖ ఆభరణాలు, వస్త్రాల సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన స్నేహ పెళ్లి చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలని భావిస్తుందట. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఈ సుందరి వుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.