'ఏదీ దాచుకోను, అబద్దాలు చెప్పలేను. నా చిన్నతనంలో జరిగిన విషయాలన్నీ పొల్లుపోకుండా
చెబుతుంటా. అందులో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. ఒక్కోసారి స్పీచ్‌లు
తట్టుకోలేక స్నేహితులు గోలపెడుతుంటారు. అవన్నీ ఎందుకు చెబుతుంటావని తిడుతారు
కూడా. ఏదైనా విషయాన్ని నా కడుపులో దాచుకోవటం వల్లకాదు. నలుగురితో పంచుకొని,
హాయిగా భారాన్ని దించుకుంటా. అది నా బలహీనత' అంటోంది 'దబాంగ్' హీరోయిన్
సోనాక్షిసిన్హా. చేసిన మొదటిచిత్రం మంచి విజయం సాధించటంతో పేరొందిన ప్రాజెక్టులన్నీ ఆవిడ
ముందు వరుస కట్టాయి. ఈ సందర్భంగా తన గురించి పలు విషయాలు ఇలా
చెబుతోంది...'సినిమాల్లోకి రాకముందు చాలా బొద్దుగా, చాలా బరువుండేదాన్ని. పరిశ్రమలో
అడుగుపెట్టడమే ఆలస్యం. శరీరాకృతిపై దృష్టిపెట్టా. సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్...మొదలైనవి
ప్రారంభించి దాదాపు 30 కిలోలు తగ్గా. నన్ను ఈ దిశగా ప్రోత్సహించింది...సల్మాన్‌ఖాన్.
సినిమా చేస్తున్నానని తెలియగానే స్నేహితులు, కుటుంబసభ్యులు సహకరించారు.
ఇక తిండి విషయంలో మాత్రం మార్పు రాలేదు. నోరూరించే పదార్థం కనబడగానే
నిగ్రహించుకోవటం కష్టం. రెండు గ్లాసుల గ్రీన్ టీతో మొదలెడితే, పిజ్జాలు, బర్గర్లు, వెరైటీ ఫుడ్
ఇష్టంగా లాగించేయడమే. తినడం పూర్తయ్యాక బరువు సంగతి గుర్తుకువస్తుంది. కేవలం
వ్యాయామంతోనే అందంగా కనిపించం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ద్వారా మరింత
అందంగా తయారవుతాం' చెప్పుకొచ్చింది.
|