ఒకప్పుడు యావత్ భారతదేశాన్ని తన నటనతో, అందచందాలతో ఉర్రూతలూగించిన
శ్రీదేవి ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు
ఆమె కూతురును చిత్రసీమకు పరిచయం చేయాలని భావిస్తుందని చాలా రోజుల
నుంచి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం. ఈ విషయంలో శ్రీదేవి తన
ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శ్రీదేవి తన
కుమార్తె జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలనే ప్రయత్నాల్లో ఉందనే
వార్తలు ఇటీవల ఊపందుకున్నాయి. తమిళంలో ‘సుబ్రహ్మణ్యపురం’ (తెలుగులో
‘అనంతపురం’ పేరుతో డబ్ అయ్యింది), ‘నాడోడిగళ్’ (తెలుగులో ‘శంభో శివ శంభో’)
చిత్రాలతో అటు దర్శకుడిగా, ఇటు నిర్మాతగా పేరు గడించిన శశికుమార్ ను, శ్రీదేవి
బోనీకపూర్ విందుకు రమ్మని ముంబాయికి ఆహ్వానించినట్టు ఉటంకించాయి. ఆ
విందులో ముగ్గురు జాన్వీ తెరంగేట్రం గురించి చర్చించుకున్నట్టు, తమిళంలో
జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు శశికుమార్ అంగీకరించినట్టు
పేర్కొన్నాయి.
అయితే అంతా బాగుందని శ్రీదేవి అభిమానులు భావిస్తున్న తరుణంలో శశికుమార్
ఆ వార్తలను కొట్టి పారేశాడు. తమిళంలో హీరో విక్రమ్ నిర్మిస్తున్న చిత్రానికి కథ, స్క్రీన్
ప్లే, మాటలను సమకూర్చే పనుల్లో తలమునకలై ఉన్న శశికుమార్... అసలు తాను
శ్రీదేవితో భాటీ కాలేదని, ఎలాంటి సినిమా ప్రాజెక్టులను ఆమెతో చర్చించలేదని తేల్చి
చెప్పాడు. దీంతో శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగ్రేట్రానికి తాత్కాలికంగా
తెరపడినట్టయిందని అయితే, మరో ప్రతిభావంతుడైన దర్శకుడితో జాహ్నవిని
పరిశ్రమకు పరిచయం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
|