బాలీవుడ్ గాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడమే ఇపుడు నా ముందున్న పెద్ద కల అని అంటున్నాడు... ఇండియన్ ఐడల్-5 మ్యూజిక్ రియాలిటీ షో విజేత శ్రీరామచంద్ర. బాలీవుడ్ గాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే ముందు... స్వరమాంత్రికుడు ఎఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ''ఫైనల్స్‌లో విజయం సాధించే లక్ష్యంతో ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేచాను.ఇపుడు నేను మామూలు శ్రీరామ్‌ని కాదు. ఈ షో నాకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది'' అంటూ శ్రీరామ్ తన మనసులో మాటలను పంచుకున్నాడు. ''యాశ్‌రాజ్ ఫిలిమ్స్ కోసం పాట పాడటం గొప్ప అదృష్టం. ఇండియన్ ఐడల్ షో వల్లనే ఇది సాధ్యమవుతోంది'' అని అంటాడు శ్రీరామ్. తనకు అన్ని రకాల పాటల్నీ పాడాలని ఉందని, సొంతంగా ఒక ఆల్బం కూడా చేసే కోరిక ఉందని తెలిపాడు. ప్రస్తుతం పార్టీ మూడ్‌లో ఉన్న శ్రీరామ్ హైదరాబాద్ చేరుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
కలలు కన్నాడు... నెరవేర్చుకున్నాడు
ఇండియన్ ఐడల్-5 విజేత శ్రీరామచంద్ర తండ్రి సంగీత ప్రియుడే.. 1975-78 ప్రాంతంలో ఆయన పాటలు పాడేవారు.. ఓ సినిమాలోనైనా పాడే అవకాశం వస్తే బాగుండును అని ఎన్ని కలలు కన్నారో..! అవి కలలుగానే మిగిలిపోయాయి. న్యాయవాద వృత్తిలోనే స్థిరపడిపోయారు. అయితే... తండ్రి కోరికను శ్రీరామచంద్ర నిజం చేశాడు. తను కూడా తండ్రిలాగానే గాయకుడు కావాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోవడమే కాకుండా తన గానంతో తెలుగోడి సత్తాని ప్రపంచానికి చాటిచెప్పాడు.
చిన్నప్పటినుంచి శ్రీరామ్‌కు సంగీతమంటే ప్రాణం. మామయ్య సి. వెంకటాచలం 'మెగాస్టార్స్' పేరుతో ఆర్కెస్ట్రా నిర్వహించేవాడు. చిన్నారి శ్రీరామ్ ఆయనతో కలిసి కచేరీలకు వెళ్లేవాడు. అలా ఎనిమిదేళ్లకే రవీంద్రభారతి వేదికపై తొలి పాట పాడాడు. రాన్రాను ఆ ఆసక్తి సాధనతో రాటు దేలింది. ఎక్కడ పాట వినిపించినా చెవులు రిక్కించేవాడు. రాత్రిళ్లు నిద్ర మానుకొని రేడియోలో హిందీ, ఇంగ్లిష్ పాటలు వింటూ ఊగిపోయేవాడు. దీన్ని గమనించిన స్నేహితుడు అనిల్ 'ఒరేయ్ నీకున్న ఇష్టానికి సంప్రదాయ సంగీతం తోడైతే మంచి సింగర్ అవుతా'వంటూ 'శ్రీ భక్త రామదాసు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ'లో చేర్పించాడు. శ్రీరామ్ అప్పుడు ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. అక్కడే 'హైదరాబాద్ సిస్టర్స్'లో ఒకరైన హరిప్రియ దగ్గర ఐదేళ్లు కర్నాటక సంగీతం నేర్చుకున్నాడు. ప్రఖ్యాత పాల్ అగస్టీన్ దగ్గర రెండేళ్లు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. ముంబైలో ఉన్నపుడు కొన్నాళ్లు గౌతం ముఖర్జీ మాస్టారి దగ్గర హిందుస్థానీ సంగీత సాధన చేశాడు.
గుండె గొంతుకలో కొట్లాడుతున్నప్పుడు బహుమతులకేం తక్కువ? ఏ పోటీకి వెళ్లినా ఇతడిదే జయం. 'ఇండియన్ ఐడల్' గురించి ఇతడికి తొలిసారిగా తెలిసింది 2004లో. అప్పుడే పాల్గొనాలనుకున్నా ఆడిషన్స్ ముగియడంతో వీలుకాలేదు. తర్వాత ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. సంగీతంలో ఐదేళ్ల డిప్లొమా కూడా చేతికందింది. ఇండియన్ ఐడల్-5 పోటీలకు సిద్ధమయ్యాడు. ఆడిషన్స్ జరుగుతున్న అహ్మదాబాద్‌కు బయల్దేరాడు. అక్కడ తెల్లవారుజామున మూడుగంటలకెళ్లి క్యూలో నిల్చుంటే సాయంత్రానికిగానీ పాడే అవకాశం రాలేదు. అహ్మదాబాద్‌లో ఇరవై ఒక్కవేలమంది... దేశవ్యాప్తంగా లక్షా ఎనభైవేలమంది మంది యువ గాయనీ గాయకులు పోటీ పడ్డారు. ఐదు వడపోతల్లో వరుసగా 120, 40, 25, 16, 13 మంది మిగిలారు. శ్రీరామ్ రెండుసార్లు డేంజర్ జోన్‌లో ఉంటూనే టాప్ 3లోకి చేరడం విశేషం.
కార్యక్రమం మొదలైన రోజు నుంచి శ్రీరామ్ పాటకు పరవశించని జడ్జీలు, గెస్ట్‌లు లేరు. మనోడి 'క్వాజా మేరే క్వాజా...' పాటకు సంజయ్‌దత్ కళ్లనీళ్లు పెట్టుకుంటే... జాన్ అబ్రహం 'నా పాటకు నీ వాయిస్ అయితేనే కరెక్ట్' అని తేల్చేశాడు. ఇక డ్రీమ్‌గర్ల్ హేమమాలిని తెలుగులో మాట్లాడి కోరి మరీ నచ్చిన పాట పాడించుకుంది. బిపాషా బసు, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి సుందరాంగులు శ్రీరామ్ గాత్రానికి జోహార్లు పలికారు. ఇండియన్ ఐడల్ జడ్జీల్లో ఒకరైన అనూమాలిక్‌కు మొదటినుంచి ఫేవరిట్ సింగర్ మనోడే. 'బాలీవుడ్‌లో ఓ మంచి సింగర్‌గా రాణించే సత్తా నీకే ఉంది' అని వేదిక మీదే చెప్పేశాడు. మరో జడ్జి... సంగీత దర్శకుడు సలీం మర్చంట్ ఏకంగా తను చేస్తున్న సినిమాలో శ్రీరామ్‌ని మేటి గాయని శ్రేయా ఘోషల్‌తో కలిసి పాడించాడు.
|