Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఫిబ్రవరి 14న తారల క్రికెట్‌ మ్యాచ్

      తెలుగు చలనచిత్ర సీమలోని పేద కళాకారులకు అండగా నిలిచేందుకు స్టార్‌ క్రికెట్‌ ద్వారా నిధులు సేకరించాలని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సంకల్పించింది. వచ్చే యేడాది ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో 'మా ప్రీమియర్‌ లీగ్‌ టీ20 టీమ్‌ కప్‌' పేరిట స్టార్‌ క్రికెట్‌ని నిర్వహిస్తారు. 'మా' అధ్యక్షులు మురళీమోహన్‌ విలేకర్లతో మాట్లాడుతూ- ''వరద బాధితుల సహాయం కోసం ఇటీవల మేం నిర్వహించిన స్టార్‌నైట్‌ విజయవంతమైంది. కేవలం 20 రోజుల వ్యవధిలో అన్ని కార్యక్రమాల్ని నిర్వహించి నిధులు సేకరించగలిగాం. అదే విధంగా 'మా'లోని పేద కళాకారుల్ని ఆదుకొనేందుకు స్టార్‌ క్రికెట్‌ని నిర్వహించబోతున్నాం. పైకి సిల్కు చొక్కాలతో కనిపించినా లోపల చిరిగిన బనీన్లతో ఉండే పేద కళాకారులున్నారు ఇక్కడ. చివరి దశలో ఎన్నో ఇబ్బందులుపడుతున్నారు. వారిని చాలాసార్లు మా అదుకొంది. వైద్యం కోసం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా మా కడుతోంది. మా సభ్యుల్లో ధనవంతులున్నారు. అయితే సంస్థకి డబ్బుల్లేవు. నిధుల సేకరణ నిమిత్తం డిసెంబరు 13న స్టార్‌ క్రికెట్‌ నిర్వహించాలనుకున్నాం. అయితే స్టార్‌నైట్‌ మూలంగా వాయిదా వేశాం. ఫిబ్రవరి 14న నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ‘వి.ఆర్.కె.ఈవెంట్ సొల్యూషన్స్’ సంస్థ రూపకల్పన చేస్తుందని’ ఆయన చెప్పారు.

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ 'మా నటీనటులందరికీ మాతృ సంస్థ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌. వరద బాధితుల కోసం నిధులు సేకరించాం. ఇప్పుడు మా ఇంట్లోవాళ్ల కోసం స్టార్‌ క్రికెట్‌ ఆడబోతున్నాం. దీన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామ''న్నారు. ''గతంలో రెండుసార్లు ఇలాంటి క్రీడోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాం. మూడోసారీ విజయవంతం చేసి హ్యాట్రిక్‌ సాధిస్తాం. నటీనటులందరం బాలకృష్ణ ఆధ్వర్యంలో పాల్గొంటామ''ని శ్రీకాంత్‌ అన్నారు. ఈ సమావేశంలో మంచు విష్ణువర్ధన్‌బాబు, జయసుధ, అలీ, కల్యాణ్‌రామ్‌, తారకరత్న, రాజీవ్‌ కనకాల, అశోక్‌కుమార్‌, ఏవీఎస్‌, మాణిక్‌, శివకృష్ణ, శివాజీరాజా, రాజారవీంద్ర, బెంగళూరు పద్మ పాల్గొన్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005