తాను రాజకీయాలలోకి ప్రవేశించే వుద్దేశ్యం లేదని ప్రముఖ నటుడు సూర్య వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో ‘రక్త చరిత్ర’ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇందులో సూర్య, వివేక్ ఓబ్రాయ్, ప్రియమణి నటిస్తున్నారు.
ఈ చిత్రం పరిచయ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంలో సూర్య మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం హింసను ప్రేరేపించే విధంగా రూపొందలేదు. నేరం చేస్తే శిక్ష ఉంటుందని చట్టంలో రాసి ఉంది. అయినా నేరాలు, ఘోరాలు జరుగుతూనే వున్నాయి. నేరం చేస్తే ఎలాంటి శిక్ష వుంటుందనే అంశం ఆధారంగా ‘రక్త చరిత్ర’ చిత్రం రూపొందిస్తున్నారు. అనేక హిందీ చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చినా వాటిని నేను నిరాకరించాను. అయితే ఈ చిత్ర కథ, సందేశం నచ్చడంతో ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. మధురైకి చెందిన ఒకరి వద్ద హిందీ నేర్చుకున్నాను. అలాగే నా భార్య జ్యోతిక సహకారంతో హిందీ మరింతగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. ఎప్పటికీ రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశ్యం లేదు. మా నాన్నగారు, ప్రముఖ నటులు శివకుమార్ గత 30 సంవత్సరాలుగా విద్యాభివృద్ధికి సహాయం చేస్తూ తమ సేవలు విద్యార్థి లోకానికి అందిస్తున్నారు. నేను కూడా ఆయన మార్గంలోనే నడుస్తూ ఆర్థికంగా అవకాశాలు లేక విద్యకు దూరమౌతున్న విద్యార్థినీ విదా్యర్థులను మా ట్రస్టు ద్వారా తీర్చిదిద్దగలుగుతున్నందుకు ఆనందిస్తున్నాను’’అన్నారు.
|