మసాలా
 
 
 
 
సంతోషమే ప్రధానం
తనకు డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ముఖ్యం కాదని అంటోంది కలర్స్ స్వాతి. తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈ చలాకీ గుమ్మకు తెలుగులో నటించిన అష్టా చమ్మ కలిసొచ్చింది. తమిళంలో సుబ్రమణిపురం శుభారంభం పలికింది. ఇటీవల ఆమె నటించిన పోరాళి (తెలుగులో సంఘర్షణ) చిత్రం కూడా స్వాతికి మంచి పేరు తెచ్చిపెట్టిందట. ఈ సందర్భంగా ఈ చిరునవ్వుల చిన్నదానితో చిన్న భేటీ.

నటిగా మీ జీవిత ప్రణాళికను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?
ప్రణాళిక అంటూ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే నేను నటిని అవుతానని ఊహించలేదు. యాదృశ్చికంగానే జరిగింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నిస్తాను. కాలం నిర్ణయించిన దారిలో నడవడమే నాకిష్టం.

సుబ్రమణిపురం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయకపోవడానికి కారణం?
సుబ్రమణిపురం చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తర్వాత పలు అవకాశాలు వచ్చాయి. వాటిలో మనసుకు నచ్చిన పాత్రలేవీ లేకపోవడంతో ఒప్పుకోలేదు. ఇటీవల విడుదలైన పోరాళి చిత్రం నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందనే చెప్పాలి.

మీరు తెలుగులో నటించిన డేంజర్ చిత్రం తమిళంలో అపాయం పేరుతో అనువాదం అయ్యింది. ఈ చిత్రం గురించి?
ఈ చిత్రం చేయడం మరచిపోలేని అనుభవం. దర్శకుడు కృష్ణవంశి నుంచి పిలుపురాగానే ఏ హిందీ చిత్రానికి డబ్బింగ్ చెప్పమంటారోనని అనుకున్నాను. డేంజర్ చిత్రంలో మహాలక్ష్మి అనే ముఖ్య పాత్రలో నటించే అవకాశం కల్పిస్తారని ఊహించలేదు. ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అటవీ ప్రాంతాల్లో జరిగింది. గుంటల్లో, గోతుల్లో, ముళ్ల కంప ల్లో పడి లేస్తూ భయం భయంగా నటిం చాం. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది.

నటిగా ఆశలు, ఆశయాలు ?
నాకు డబ్బు, పేరు ముఖ్యం కాదు. సంతోషమే ప్రధానం. కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా షాపింగ్ చేయడం, స్నేహితురాళ్లతో జాలీగా ఊరు చుట్టి రావడం వంటి ఒక సరాసరి అమ్మాయిగా జీవిస్తే చాలనుకుంటాను. ఏదో సాధించాలనే ఆశ కూడా లేదు.

మీపై వస్తున్న విమర్శల గురించి ఎలా స్పందిస్తారు?
నా గురించి చాలా పుకార్లు, విమర్శలు వస్తున్నాయి. విమర్శలకు కూడా ఒక అర్హత ఉంటుంది. అలాంటి విమర్శలను గౌరవిస్తాను. ఇతర వదంతుల గురించి భయపడాల్సిన అవసరం లేదు.